విజయనగరం జిల్లాలో 41వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో వివిధ రకాలకు చెందిన 60వేల వరకు పుస్తకాలు ఉన్నాయి. పదివేల మంది పాఠకులూ చందాదారులుగా కొనసాగుతున్నారు. అయితే.. జిల్లాలోని 41 గ్రంథాలయాల నిర్వహణకు 68మంది సిబ్బంది అవసరం. కానీ.. ప్రస్తుతం గ్రంథాలయాల అధికారులతో కలిపి.. 34 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పొరుగు సేవల ద్వారా మరో 13మంది విధులు నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా గ్రంథాలయాల్లో ఉద్యోగుల ఖాళీలు భర్తీ కావటం లేదు. అరకొర సిబ్బందితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు.
గ్రంథాలయాల్లో సిబ్బంది, ఇతర సమస్యల పరిష్కారం కోసం.. పుస్తకాల డిజిటలైజేషన్‌కు రాష్ట్ర గ్రంథాలయ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను విజయనగరం జిల్లా గ్రంథాలయం నుంచే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలోని 42వేల పుస్తకాల వివరాలను కంప్యూటరీకరించారు. ప్రతి పుస్తకం కంప్యూటర్‌లో అందుబాటులో ఉండేటట్లు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. దశల వారీగా జిల్లాలోని ద్వితీయ, తృతీయ, గ్రామీణ శాఖ గ్రంథాలయాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు గ్రంథాలయ రాష్ట్ర సంచాలకులు ప్రసన్నకుమార్ తెలిపారు.