Scholarships Issue: సరైన సమయంలో ఫీజులు కట్టకపోతే.. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ పట్టభద్రులకు సంబంధిత కళాశాలల యజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవటం విన్నాం. అయితే విజయనగరం జిల్లాలో అందుకు భిన్నంగా జరిగింది. జిల్లాలోని కోరుకొండ సైనిక్ పాఠశాల విద్యార్ధులకు సకాలంలో ఉపకార వేతనాలు అందక.. ఫీజులు చెల్లించలేక.. పాఠశాల నుంచి విద్యార్థులే టీసీలు వెనక్కి తీసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం కోరుకొండ సైనిక్ పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల సంఘం.. స్పందనలో కలెక్టర్కు వినతి పత్రం అందచేశారు.
సైనిక్ పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాలను సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు అధికారులకు విన్నవించారు. ఉపకార వేతనాల్లో కేంద్రం వాటా మంజూరు కాగా.., రాష్ట్ర ప్రభుత్వం వాటా అందకపోవటంతో పేద విద్యార్ధులు ఫీజులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని.. బాధిత తల్లిదండ్రులు స్పందనలో అధికారుల ముందు వాపోయారు. ఇప్పటికే 36మంది కోరుకొండ సైనిక పాఠశాల నుంచి టీసీలు తీసుకుపోయారని తెలియచేశారు.
ఈ సందర్భంగా కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయాలంటూ స్పందనలో కలెక్టర్కు వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సైనిక పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాలు మంజూరు చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ పరిస్థితులలో పాఠశాల ఫీజులు చెల్లించలేక ఏడాది కాలంలో 36మంది విద్యార్ధులు టీసీలు తీసుకున్నారని వాపోయారు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. నేడు ఫీజులు చెల్లించలేక టీసీలు తీసుకుపోవటం బాధాకరమన్నారు.