పేదలకు, సామాన్య ప్రజలకు సక్రమంగా వైద్యం అందేలా చూడటమే అందరి బాధ్యతని.. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు అన్నారు. కరోనా నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవిడ్ ఆసుపత్రుల పనితీరు, సదుపాయాలు, మందులు, వైద్యం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశమైన జాయింట్ కలెక్టర్.. పలు ఆసుపత్రులపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇకనైనా ఆ ఆసుపత్రులు పనితీరు మార్చుకోకపోతే.. ఆయా ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. కొవిడ్ రోగులను నేరుగా ఆసుత్రుల్లో చేర్చుకునేందుకు అనుమతులు ఇవ్వొద్దనీ.. వైద్యాధికారుల సూచనల మేరకు మాత్రమే అనుమతించాలని సూచించారు.
అక్రమాలకు పాల్పడితే.. లైసెన్సులు రద్దు చేస్తాం - vijayanagaram jc review meeting
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు వైద్యాధికారులతో సమావేశమయ్యారు. కొన్ని ఆసుపత్రుల పనితీరుపై తమకు ఫిర్యాదులు అందాయనీ.. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి కొవిడ్ ఆసుపత్రిలో క్రిటికల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర రోగుల కోసం ఒక వెంటిలేటర్ బెడ్, రెండు ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలను రిజర్వ్ చేసి ఉంచాలన్నారు. ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు మేనేజర్‌ను నియమించి.. ప్రతి 4 గంటలకు తప్పనిసరిగా పడకల ఖాళీ వివరాలను అప్డేట్ చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో పడకల పరిస్థితి, మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్ల వివరాలపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయటానికి వెనకాడమని హెచ్చరించారు.
ఇదీ చదవండి:బాధ్యత కేటాయింపులకు అధ్యయన కమిటీ