ఆర్థికాభివృద్ధి కోసం.. వివిధ ప్రాంతాల మధ్య రహదారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కేంద్రం భారతమాల కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 20 గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మిస్తోంది. రాష్ట్రంలోనూ 5 రహదారులను ప్రతిపాదించగా.. వాటిలో విశాఖ నుంచి విజయనగరం జిల్లా మీదుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ వరకు నిర్మించతలపెట్టిన 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ఒకటి. ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం వద్ద ప్రారంభమై.. పాచిపెంట మండలం ఆలూరు వరకు ప్రతిపాదించారు. జిల్లాలో సుమారు 94.297 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. సుమారుగా 642.99 హెక్టార్ల మేర భూమిని సేకరించనున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణం తమకు అంగీకారం కాదంటున్న రైతులు.. ప్రతిపాదిత మార్గంతో 3 పంటలు పండే పొలాలను వదులుకోవాల్సి వస్తుందంటున్నారు.
విశాఖ–ఛత్తీస్‌గఢ్ రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు - Green Filed National Highway Road in Vizianagaram latest news
విశాఖ-ఛత్తీస్‌గఢ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి భూసేకరణను.. విజయనగరం జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 'భారతమాల' ప్రాజెక్టులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ను విశాఖ పోర్టుకు అనుసంధానం చేసేందుకు.. కేంద్రం ఈ రహదారిని ప్రతిపాదించింది. ప్రతిపాదనల ప్రకారం భూములిస్తే.. తామంతా రోడ్డున పడతామని.. రైతులు ససేమిరా అంటున్నారు.
రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటున్న రైతు సంఘాలు... మొండిగా ముందుకెళ్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇప్పటికే 80 శాతం భూసేకరణ పూర్తయిందని... అధికారులు డిసెంబర్ చివరి నాటికి మొత్తం సేకరణ పూర్తిచేస్తామని చెబుతున్నారు. ప్రతిపాదిత మార్గంలో కాకుండా ఇప్పటికే ఉన్న విశాఖ–ఛత్తీస్‌గఢ్ రహదారిని విస్తరిస్తే సరిపోతుందని... రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:మళ్లీ కేంద్ర జలసంఘం పరిశీలనకు పోలవరం ఖర్చు