ఈమె విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. కరోనా నేపథ్యంలో పిల్లలు పుస్తకాలకు దూరం కావటం ఇదే సమయంలో వీడియో గెమ్స్ పట్ల ఆకర్షితులవ్వటం ఈ ప్రధానోపాధ్యాయురాలిని ఆలోచింపచేసింది. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే ఆన్‌లైన్ గేమ్స్‌తోనే వాళ్లలో నైపుణ్యాలు, సృజన పెంచాలని ప్రయత్నించారు. ఇంటర్ చదువుతున్న తమ కుమారుడి సహాయంతో పిల్లలకు ఇష్టమైన, అనుకూలమైన అంశాలను తీసుకుని ఆటల రూపంలో పాఠాలు రూపొందించారు. వీటికి ఫ్రీ స్మార్ట్ క్లాస్ పేరుతో వైబ్ సైట్‌నూ రూపొందించి ఉచితంగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచారు.
వాయిస్ కమాండ్తో...
పిల్లల్లో విద్యానైపుణ్యాలు పెంపొందించడం, విద్య వైపు వారి దృష్టిని ఆకర్షించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా తొలుత 18 రకాల ఆన్‌లైన్ ఆటలను తయారు చేశారు. వీటికి విశేష స్పందన లభించటంతో ట్రయల్, ఎర్రర్ మెథడ్స్, గ్రాఫిక్, పిక్చర్ రీడింగ్ వంటి విధానాలతో పలు అంశాలతో కూడిన వీడియోలను తయారు చేశారు. ఆటలో ఆసక్తి ఉండేలా ఒప్పు చేస్తే ప్రశంసలు పొందే విధంగా వాయిస్ కమాండ్‌ను జతచేశారు. తప్పు చేస్తే ఆప్యాయంగా కూడిన ఆదేశాలు అమర్చారు. తద్వారా పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేలా తీర్చిదిద్దారు. ప్రతి విద్యార్థి వారి సొంత స్కోరును పొందవచ్చు. సరిగ్గా చేయడం ద్వారా గరిష్ఠ స్కోరును పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇది భాషపై పట్టు పెరగడానికి పరోక్షంగా దోహదపడుతుందని ఉపాధ్యాయురాలు తెలిపారు.