విజయనగరం జిల్లా గరివిడిలోని వోఈయూ లయన్స్ కంటి ఆసుపత్రి. 25పడకలతో ప్రారంభమైన ఈ వైద్యశాల, నేడు 50 పడకల స్థాయికి చేరింది. ఇక్కడ నిత్యం వంద నుంచి రెండొందల మంది వరకు వైద్యం కోసం వస్తారు. కంటికి సంబంధించిన అన్ని సమస్యలను ఇక్కడ ఉచితంగా పరీక్షిస్తారు. పేదలకు ఉచిత సేవలతో పాటు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఏడాదికి సుమారు 2వేల మంది రోగులు వైద్యం కోసం వస్తారు. వీరిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మారుమూల గ్రామాల ప్రజలు ఎక్కువగా ఉంటారు.
పేదలకు వెలుగు.. వోఈయూ లయన్స్ ఆస్పత్రి - hospital
కంటిచూపు లేకపోతే సృష్టిని చూడలేం. పుట్టుకతో కొందరు, వ్యాధులకు గురై మరికొందరు, ప్రమాదవశాత్తూ ఇంకొందరు కంటిచూపు కోల్పోతున్నారు. వీరు శస్త్రచికిత్స చేయించుకోవాలంటే.. లక్షలతో కూడుకున్న పని. అలాంటి వారికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి, కంటి చూపు ప్రసాదిస్తుంది. ఆ వైద్యశాల ఇప్పటివరకు 500 మందికి పైగా చికిత్సలు అందించి.. తన ఔదార్యాన్ని చాటుకుంది.
శుక్లాల మార్పు, కార్నియా తొలగింపు వంటి వైద్య సేవల కోసం వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని బట్టి.. 20నుంచి 30శాతం మాత్రమే వసూలు చేస్తారు. నిరుపేదలైతే ఆ సేవలను ఉచితంగా అందిస్తారు. అంతేకాదు కార్నియల్, గ్లూకోమా వంటి వైద్య సేవలు పొందిన వ్యక్తులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. లేనిపక్షంలో వారికి పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారి జాబితాను తయారు చేసుకుని, క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షల ఆధారంగా వైద్య సేవలతో పాటు, మందులూ అందజేస్తోంది.
ఆస్పత్రిలో సేవలు బాగున్నాయని, వైద్యం అందించిన దగ్గర నుంచి, ఇంటికి వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని.. చికిత్సకు వచ్చిన వారు చెబుతున్నారు. ఉన్నంతలో పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నామంటున్నారు సూపరింటెండెంట్ సునిల్ కుమార్ తంగరాజు.. ఈ సేవలు ఇలానే కొనసాగుతాయంటున్నారు.