విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల ప్రారంభం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామంలోని సర్వే నంబర్ 36లో 26 సెంట్ల భూమిపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఇది గ్రామ కంఠం భూమి అని స్థానికులు వాదిస్తున్నా... ఆ స్థలంలోనే రైతు భరోసా కేంద్రం నిర్మించేందుకు అధికారులు శనివారం ప్రయత్నించారు. పెద్ద ఎత్తున స్థానికులు నిరసన వ్యక్తం చేయటంతో ఏడుగురు ఎస్సైలు, ముగ్గురు సీఐలు సహా వంద మందికి పైగా పోలీసులు గ్రామంలో మోహరించారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను సైతం బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్కి తరలించారు. చివరికి పోలీసుల బందోబస్తు నడుమ రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రెండు రోజులు గడువు కోరినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీకే నిర్మాణానికి మరో చోట స్థలం చూపిస్తామన్నా వినిపించుకోలేదని మండిపడ్డారు.