ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గాంధీ వర్ధంతి రోజు నిరసనలు - Mahatma Gandhi death anniversary

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వివిధ జిల్లాల్లో ప్రజా, రైతు సంఘాలు పూలమాల వేసి నివాళులర్పించాయి. కొత్త సాగు చట్టాల రద్దు కోసం దిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపాయి. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించాయి.

Unions Agitation
గాంధీ వర్థంతి రోజు నిరసనలు

By

Published : Jan 30, 2021, 7:50 PM IST

రాష్ట్రంలోని పలు జిల్లాలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రైతు సంఘాలు అంజలి ఘటించాయి. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసనలు నిర్వహించాయి.

విజయనగరంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని ఖండిస్తూ... కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్.కృష్ణమూర్తి పాల్గొన్నారు. 64 రోజులుగా శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోళనలను... విచ్ఛిన్నం చేయడానికి మతోన్మాద విధ్వంసకారులు యత్నిస్తున్నారన్నారు. రైతు పోరాటానికి మద్దతుగా వైకాపా, తెదేపా మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల సమస్యలను పక్కన పెట్టి... రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు.

విశాఖ..

దిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా విశాఖపట్టణంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోదీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించాయి. సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే... కేంద్రం వాటిని హింసాత్మకంగా మార్చడానికి యత్నిస్తోందని ఆరోపించాయి. రైతులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

హిందూపురం...

అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు సత్యాగ్రహాన్ని కొనసాగించారు.

విజయవాడ...

గాంధీజీ వర్ధంతి సందర్భంగా రైతులకు మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద అఖిల భారత రైతు సమన్వయ సమితి నిరసన చేపట్టింది. దిల్లీలో చేస్తున్న కర్షకుల ఉద్యమానికి సంఘీభావం తెలిపింది. రైతులు గెలవాలి వ్యవసాయం నిలవాలి అని నినదించింది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

నెల్లూరు...

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నెల్లూరు జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్త సాగు చట్టాలు వల్ల కర్షకులకు నష్టం కలుగుతుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'అహింస మార్గంలోనే అమరావతి ఉద్యమం కొనసాగుతుంది'

ABOUT THE AUTHOR

...view details