ఫిబ్రవరి గడిచిపోతున్నా.. విజయనగరం జిల్లా రైతుల కష్టాలు తీరలేదు. సాలూరు మండలం బాగవలస, మామిడిపల్లి, శివరాంపురం పీఎస్ పరిధిలో చాలా వరకు ధాన్యం కొనుగోలు చెయ్యక కల్లంలోనే పంట ఉండిపోయింది. జనవరి 11 నుంచి కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలు నిలిపేశారు. అనంతరం కొన్ని రోజులు తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ రైతులు తీసుకొచ్చిన రకాలు కొనుగోలు అప్పటికే పూర్తైందన్న అధికారుల సమాచారం రైతు కంటతడిపెట్టిస్తోంది.
కుప్పలను వర్షాల నుంచి రక్షించుకుంటూ సంచుల్లో ఎత్తిన ధాన్యాన్ని ఏం చేయాలో పాలుపోక రైతు దిగాలు చెందుతున్నాడు. మండలంలో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ధాన్యం కొనుగోలు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.