విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లికి చెందిన లింగాల శంకర్.. ఇంటర్ తర్వాత విశాఖలోని గీతం కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మొదటి ప్రయత్నంలోనే హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 11.50 లక్షల రూపాయల జీతంతో ఆరేళ్ల పాటు ఉద్యోగం చేశాడు. అయితే లక్షలు ఇచ్చే ఉద్యోగం అతనికి తృప్తి ఇవ్వలేదు. తన మనసుకు నచ్చిన పని చేయాలని కొలువుకు రాజీనామా చేసి సేద్యం వైపు మళ్లాడు. సాగు వద్దని.. అందులో దిగితే నష్టం తప్ప లాభాలు ఉండవని తల్లిదండ్రులు వారించినా వినలేదు. పట్టుబట్టి వారిని ఒప్పించాడు. అలా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు.
ప్రకృతి సాగు-బహుళ పంటలు బాగు
మొదట్లో తల్లిదండ్రులు సహకారంతో పంటల సాగు చేపట్టాడు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోవటంతో ఆధునిక వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. గో ఆధారిత, సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలను అనుసరించాడు. బహుళ పంటలసాగు పాటించాడు. 2 ఎకరాల్లోనే బీర, సొరకాయ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కంద, ముల్లంగి, బీట్రూట్ వేశాడు. వాటిలో అంతర పంటలుగా వంగ, టమాటా, మిరప, బెండ, ఉల్లి వాటి మధ్య ఆకుకూరలు, చామంతి పూల సాగు చేశాడు. మరోపక్క స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇలా 365 రోజులూ ఏదో ఒక పంట చేతికి వచ్చేలా సాగు విధానాన్ని అనుసరించాడు.
సొంతంగా మార్కెటింగ్
పంటల సాగులో స్వల్ప పెట్టుబడులు, నూతన విధానాలతో మెరుగైన దిగుబడులు సాధిస్తున్న శంకర్ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రైతుమిత్ర సంఘం పేరుతో తన పంటలతోపాటు తోటి రైతుల పంటలను మార్కెటింగ్ చేస్తున్నాడు. వారి ఉత్పత్తుల అమ్మకానికి హైదరాబాద్, విశాఖ జిల్లా అడవివరంలో దుకాణం ఏర్పాటు చేశాడు. అక్కడ సేంద్రీయ కూరగాయలు విక్రయిస్తూ అటు వినియోగదారులకూ మేలు చేస్తున్నాడు.