ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2020, 12:19 PM IST

ETV Bharat / state

గిరిజనులకు చేరువకానున్న సాంకేతిక విద్య

కురుపాం కేంద్రంగా ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంజినీరింగు కళాశాలను ఈ ఏడాదే ప్రారంభించేందుకు జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం కళాశాల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది. గిరిజనులకు ఉన్నత విద్యను అందించడం ద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడేలా దీన్ని తీర్చి దిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలు ఉన్న కురుపాం నియోజకవర్గంలో ఈ కళాశాల విద్యాకేంద్రంగా మారనుంది.

college
college

ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్‌ తరగతుల నిర్వహణకు తాత్కాలిక వసతి సౌకర్యాలను పరిశీలించేందుకు విశ్వవిద్యాలయ ఉప కులపతి రామలింగరాజు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందం కురుపాం ప్రాంతాన్ని సందర్శించింది. ఐదు కోర్సులు నిర్వహించేందుకు వీలుగా కళాశాలకు జేఎన్టీయూ మంజూరు ఇచ్చింది.

  • రూ.153 కోట్ల నిధుల కేటాయింపు

కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153 కోట్లు మంజూరు చేసింది. టేకరకండి వద్ద 105 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని కూడా కేటాయించింది.. కలెక్టరు హరిజవహర్‌లాల్‌ స్థల కేటాయింపు పత్రాలను జేఎన్టీయూకు అందించి స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసిన విషయం విదితమే.

ప్రధాన బ్రాంచ్‌లు: కళాశాల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌ను జేఎన్‌టీయూ ప్రభుత్వానికి పంపించింది. ఈ ఏడాదే తరగతులను ప్రారంభిస్తారు. ఐదు బ్రాంచిల్లో తరగతులు నిర్వహిస్తారు. సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, ఈసీఈ సీఎస్‌ఈ బ్రాంచిలు ప్రారంభించనున్నారు. తొలుత మూడు అనుకున్నా ఐదు కోర్సులతో ప్రారంభించాలని నిర్ణయించారు.

  • మూడు కిలోమీటర్ల దూరంలో విద్యాసంస్థలు

కురుపాం నుంచి రావాడలోని ఒట్టిగెడ్డ జలాశయానికి వెళ్లేందుకు వేసిన రహదారి విద్యాసంస్థలతో అలరారే వీలు కలుగుతుంది. ఇదే రహదారిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఒట్టిగెడ్డ జలాశయం పర్యాటకంగా అభివృధ్ధి చెందే అవకాశాలు ఉన్నప్పటికీ అంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు పర్యాటకంగా కూడా అభివృద్ధికి దోహదపడుతుంది.

  • ఈ రహదారి మీదుగానే జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము, పీటీ మండ గ్రామాలకు వెళ్తారు. అక్కడి నుంచి కురుపాం మండలం నీలకంఠాపురం ఏజెన్సీ ప్రాంతానికి రహదారి అనుసంధానిస్తే, మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కురుపాంకు, తర్వాత విద్యకు దగ్గరవుతాయి.
  • కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో గిరిజన ప్రాంతాలకు సమాన దూరంలో విద్యాసంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ఈ రెండు మండలాల్లో విద్య పరంగా అవకాశాలు మెరుగవుతాయి.
  • ఇక్కడ ఏర్పాటవుతున్నది గిరిజన ఇంజినీరింగు కళాశాల కాబట్టి ఉపప్రణాళిక ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లో గిరిజనులకు సాంకేతిక విద్య దగ్గరకానుంది.
  • 50 శాతం గిరిజనులకే

ఇక్కడ నిర్వహించే కోర్సుల్లో 50 శాతం సీట్లను గిరిజన విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలినవి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక విద్య గిరిజనులకు చేరువవుతుంది. ఫలితంగా వారి జీవితాల్లో మార్పులకు అవకాశం ఉంటుంది.

విద్యాభివృద్ధికి దోహదం

  • ఇంజినీరింగ్‌ కళాశాలతో కురుపాం, జియ్యమ్మలస మండలాలు అభివృద్ధికి వీలు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపార, పాలనాపరంగా కురుపాం ఏజెన్సీలో ప్రధాన కేంద్రంగా ఉంది. విద్యపరంగా కూడా ఉన్నతీకరిస్తే అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందే వీలుంటుంది.
  • నియోజకవర్గంలో రెండు పాలిటెక్నికల్‌ కళాశాలలు ఉన్నాయి. పక్కనే ఉన్న పార్వతీపురంలో మరో కళాశాల ఉంది. వీటిలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగు విద్యను అందుకొనేందుకు ఈప్రాంత వాసులకు సమీపంలోనే స్నాతకోత్తర సాంకేతిక విద్య అందుబాటులో ఉంటుంది.

అభివృద్ధికి బాటలు...

కురుపాం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో వివక్షకు గురైన గిరిజన ప్రాంతంలో వైద్య, సాంకేతిక విద్య కళాశాలలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కురుపాంలో ఇంజినీరింగు కళాశాల మంజూరు చేసి ఈప్రాంత సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించారు. నిధులను కూడా మంజూరు చేశారు. ఇతర ప్రాంత విద్యార్థులు ఇక్కడికొచ్చి సాంకేతిక విద్యను అభ్యసించడంతో అభివృద్ధికి బాటలు పడతాయి. ఐదు కోర్సులు మంజూరయ్యాయి. వసతులను దృష్టిలో ఉంచుకొని క్రమంగా కోర్సులను ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం.

- పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

ABOUT THE AUTHOR

...view details