Crop Damage:అకాల వర్షం అన్నదాతలకు తీరని ఆవేదన మిగిల్చింది. విజయనగరం జిల్లా మరుపల్లి, మామిడిపల్లి గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో పది రోజుల్లో పంట చేతికొస్తుందని సంబరపడిన రైతులకు కన్నీరే మిగిలింది. అరటి, మొక్కజొన్న నేలకొరిగటంతోపాటు వరి ధాన్యం తడిసిముద్దయిందని అన్నదాతలు విలపిస్తున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే.. ప్రకృతి తమను కష్టాల కడలిలోకి నెట్టేసిందని వాపోతున్నారు. తమకు అప్పులు తీర్చే మార్గం లేదని..,ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పంట నష్టపోయిన రైతులను సీఐటీయూ జిల్లా నేతలు పరామర్శించారు. పంట నష్టపోయిన అరటి రైతులకు ఎకరానికి రూ.70 వేలు, మొక్కజొన్నకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.