విజయనగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆనందగజపతి కళాక్షేత్రంలో జరిగిన ముగింపు సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలువురు కళాకారులు విజయనగరం చారిత్రక ప్రాశస్త్యం, సంస్కృతి, సంప్రదాయాలని ఉత్సవాల్లో ఘనంగా కీర్తించారు. ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని అమాత్యులు అభిప్రాయపడ్డారు.
ఆకట్టుకున్న నృత్యాలు
ముగింపు ఉత్సవాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. నగరానికి చెందిన పలు నృత్య అకాడమీలకు చెందిన బాలికలు ప్రదర్శించిన అమ్మవారి వైభవ నృత్యరూపకం వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. వీటితో పాటు కోట ఆవరణలో విజయనగరం కళలకు ప్రతీకగా నిలిచే పులివేషాలు అందరినీ ఎంతో అలరించాయి.