విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అనువైన 30 కేంద్రాలను జిల్లా యంత్రాంగానికి సహకార అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఆయా కేంద్రాల్లో కొనుగోళ్లు చేయాలని అభ్యర్థించారు. ఖరీఫ్‌లో జిల్లాకు నిర్దేశించిన కొనుగోలులో 2.31 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఎక్కువ భాగాన్ని సొసైటీలే కొనుగోలు చేశాయి. గడిచిన మూడేళ్లుగా పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తున్నాయి. ఆదాయ వనరులు లేనందునే.. ధాన్యం కొనుగోలుకు ఈ సంఘాలు ప్రాధాన్యమిస్తున్నాయి.
క్వింటాకు రూ.31 ఆదాయం చేకూరుతున్న కారణంగా.. ఈ సొసైటీలు కొనుగోళ్లకు ముందుకొస్తున్నాయి. ప్రతీ సంఘానికి కొనుగోలు నిమిత్తం డీసీసీబీ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి జనార్ధన్ తెలిపారు. గజపతినగరం, శివిని, తెట్టంగి సొసైటీల్లో మొక్కజొన్న కొనుగోలు చేపట్టినట్లు సీఈవో వెల్లడించారు. రైతుల డిమాండ్ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సొసైటీల్లో కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు సూచించారని అన్నారు.