భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన చేసిన సీఎం CM Jagan laid the foundation stone for Bhogapuram Airport: రాష్ట్ర వైభవానికి భోగాపురం ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయంతో పాటు తారకరామతీర్థ ప్రాజెక్టు, చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు.. సీఎం శ్రీకారం చుట్టారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలో ఉన్న కేసులను తమ ప్రభుత్వం పరిష్కరించిందని.. కేంద్రం నుంచి వేగంగా అనుమతులు తెచ్చామని సీఎం చెప్పారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళానికి సమాన దూరంలో ఎయిర్‌పోర్టు ఉంటుందన్నారు.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే ప్రాంతంగా ఉండేదన్న సీఎం.. రాబోయే రోజుల్లో జాబ్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 6లేన్ల రహదారిని నిర్మిస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం.. ఇప్పటికే కొన్ని గ్రామాలకు పునరావాసం కల్పించామని, త్వరలో మిగిలిన గ్రామాలకు సైతం పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం తొలి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సీఎం.. పరిపాలన సౌలభ్యం కోసం ఆరు జిల్లాలుగా విభజించామని చెప్పారు. అదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయన్న జగన్.. గత ప్రభుత్వాలతో తమని పోల్చి చూసుకుని మంచిని బేరీజు వేసుకోవాలన్నారు. ఎన్నికల హామీల్లో 98.50 శాతం అమలు చేశామన్న జగన్.. అందుకే ధైర్యంగా గడప గడపకూ వెళ్లి ప్రజలను కలుస్తున్నట్లు చెప్పారు. ఈ ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. గతం కన్నా మంచి జరిగి ఉంటేనే తనకు అండగా నిలబడాలని ప్రజలను కోరారు.
నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి మరికొన్ని అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టులో మొదటి దశ 2026 నాటికి 5వేల కోట్లతో పూర్తవుతుంది. ఇక తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ 60 లక్షల జనాభాకు సరిపోయే విధంగా ఎయిర్‌పోర్టు డిజైనింగ్ జరుగుతుంది. ఈ ఎయిర్‌పోర్టులో భారీ విమానాలు సైతం ఏ3ఐటీ డబుల్ డెక్కర్ ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ ఇలాంటి ఫ్లైట్లు కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8 కిలో మీటర్ల పొడవైన భారీ రన్ వేలు నిర్మించబోతున్నాం. ఎయిర్‌పోర్టుతో పాటుగా ఎయిర్‌పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయి..2026 నాటికి ఈ భోగాపురం నుంచే విమానాలు ఎగురుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్న.- సీఎం జగన్
ఇవీ చదవండి: