విజయనగరం ప్రదీప్‌నగర్ సమీపంలోని సత్యసాయినగర్ లే అవుట్ ఇది. 1982లో సర్వే నెంబర్53-4, 53-5లో సుమారు50మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు.అన్ని అనుమతులు ఉన్న తర్వాతే అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఆర్థిక స్థోమతబట్టి అప్పట్లోనే కొందరు గృహాలు నిర్మించుకున్నారు.కొందరు చిరుద్యోగులు నిర్మాణ వ్యయాన్ని భరించలేక..స్థలాన్ని అలానే ఉంచుకున్నారు.ప్రస్తుతం ఇక్కడ గజం స్థలం విలువ12నుంచి15వేల రూపాయలు పలుకుతోంది.విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన తెర మీదకు రావటంతో భూముల ధరకు మరింత రెక్కలొచ్చాయి.మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు ఆ స్థలాన్ని రాత్రికి రాత్రే ఆక్రమించుకున్నారని కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. 40ప్లాట్లకు సంబంధించిన4ఎకరాల విస్తీర్ణం చుట్టూ ప్రహరీ నిర్మించి భూమిని కబ్జా చేశారని.......,ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన చెందారు.
'మంత్రి బొత్స సోదరుడు మా ఇళ్ల స్థలాలు ఆక్రమించారు' - మంత్రి బొత్స సోదరుడు భూములు కబ్జా
సొంతగూడు లేని పేదలు, చిరుద్యోగులు... రూపాయి, రూపాయి పోగేసి, అప్పులు చేసి ఇంటి స్థలం కొనుక్కున్నారు. ఇంతలో మంత్రి బంధువు రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మించి తమ భూములను ఆక్రమించుకున్నాడని బాధితులు ఆవేదన చెందారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
అప్పులు చేసి,బంగారం కుదవ పెట్టి కొనుగోలు చేసిన భూమి మీదే ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాలు...ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.తమకు న్యాయం చేయాలని బొత్స ఆదిబాబు కుటుంబసభ్యుల వద్దవిన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితులు వెల్లడించారు.న్యాయం కోసం అందరూ ఏకమై...గత సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.భూములకు సంబంధించిన ఆధారాలు తీసుకెళ్లి అధికారుల ముందు పెట్టారు.ఇళ్ల స్థలాలను ఎలాగైనా ఇప్పించాలని అధికారులకు మొర బెట్టుకున్నారు.
ఒకవేళ ఆ భూమి బొత్స ఆదిబాబుదే అయితే... 30ఏళ్లుగా ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని,రాత్రికి రాత్రే గోడ కట్టడమేంటని ప్రశ్నించారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ లాంటి పేదవాళ్ల కడుపుకొట్టడమేంటని ఆక్రోశిస్తున్నారు.అధికారులే తమకు న్యాయం చేస్తారనే నమ్మకముందనీ, లేకపోతే బాధితులమంతా కలసి ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని బాధితులు చెప్పారు.