రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 2019 ఎన్నికలేఅందుకు మంచి ఉదాహరణ. రాజులకుటుంబాలకు చెందిన... సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న... ఇద్దరు తండ్రులు... వారి కుమార్తెలకు సంబంధించిందీ కథ..! విజయనగర సంస్థానానికి చెందిన అశోకగజపతి.. తన కుమార్తెకు రాజకీయ అక్షరాభ్యాసం చేయిస్తుంటే... కురుపాం సంస్థానానికి చెందిన కిషోర్ చంద్రదేవ్ కు ప్రత్యర్థిగా.. ఆయన కుమార్తెబరిలో నిలిచారు.
బరిలో పూసపాటి యువరాణి
యువరాణికి రాజకీయ ఓనమాలు నేర్పేందుకు సిద్ధమయ్యారు కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు. ఆయన విజయనగరం పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తూనే..కుమార్తెఅదితిని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సై అనిపించారు. ఇప్పటికే చాలా రోజులుగా తండ్రి వెంటే ఉంటూ..అదితి...రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. దశాబ్దాలుగా అశోక్ ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానంలో.. తన కుమార్తెను గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అశోక్ కుటుంబానికి తరతరాలుగా ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం ప్రకారం చూస్తే.. ఆమె గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు.