YSRCP Government Close Anna Canteen : శత్రువైనా సరే ఆకలితో ఇంటికి వస్తే, కడుపు మాడ్చుకొనైనా అన్నం పెడతారు. అలా చేయడం ధర్మం కూడానూ. కానీ జగనన్న తీరే వేరు. యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలైనా, అట్టడుగు వర్గాలకు అండగా నిలిచే ప్రత్యేక పథకాలైనా, పాలనా సౌకర్యం కోసం నిర్మించుకున్న ప్రజా వేదికైనా,పేదల కడుపు నింపే 'అన్న క్యాంటీన్' అయినా, కూలిపోవడమో, తరలిపోవడమో, నిర్వీర్యమవడమో, నిరుపయోగం కావడమో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే.
CM Stalin Continue Amma Canteen in Tamil Nadu :తమిళనాడులో జయలలిత (Jayalalithaa) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్లను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ (Stalin) అదే పేరుతో కొనసాగిస్తున్నారు. కానీ, పేదలు కడుపారా తినడం జగన్‌కు ఏమాత్రం గిట్టదు కదా? అందుకే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లను మూసివేసి వారి పొట్టకొట్టారు. టీడీపీ ప్రభుత్వం కట్టిన క్యాంటీన్లన్నీ ప్రజా ధనంతో కట్టినవే. కేవలం 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టేవి. ఒకప్పుడు పేదల ఆకలి తీరుస్తూ కళకళలాడిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు చాలాచోట్ల మూత్రవిసర్జనకు, చెత్తకుప్పలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. అధికశాతం భవనాలను వృథాగా వదిలేస్తే, మరికొన్నింటికి వైసీపీ రంగులేసుకుని గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చేసుకున్నారు.
పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్
నిరుపయోగంగా కడుపు నింపే నిలయాలు : అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. ఆహారంతో పాటు ఆ ప్రదేశాన్ని కూడా దైవసమానంగానే చూడాలి. కానీ జగన్ మనస్తత్వమే వేరు. పేదలంటే ఆయనకు ఎంత చిన్నచూపో అనంతపురం నగరంలోని కనకదాసు కూడలి వద్దనున్న అన్న క్యాంటీన్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఒకప్పుడు రోజూ వందల మందికి అన్నం పెట్టిన క్యాంటీన్‌ను చెత్త కుప్పలతో దుర్గంధభరితంగా మార్చేశారు. నగరంలోని మదర్‌థెరిసా విగ్రహం వద్దనున్నఅన్న క్యాంటీన్ పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది.