ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు.. పోలీసులకు చిక్కాడు!

ఆ కిరాణా దుకాణంలో 30 ఏళ్లు నమ్మకంగా పని చేశాడు. అక్కడ అనువణువు అతనికి తెలుసు. దుకాణ యజమాని దేవుని గదిలో ఉంచిన భారీ బంగారు వస్తువులపై కన్ను పడింది. పాత నేరస్థుడి సాయంతో చోరీకి పాల్పడి 80కి పైగా తులాల బంగారు వస్తువులు కాజేశారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు.

యజమాని దుకాణంలోనే చోరీ.. అంతకుముందు వేరేచోట ప్రాక్టిస్ దొంగతనం!
యజమాని దుకాణంలోనే చోరీ.. అంతకుముందు వేరేచోట ప్రాక్టిస్ దొంగతనం!

By

Published : May 16, 2021, 5:30 PM IST

Updated : May 16, 2021, 5:49 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేటలో గత నెల 25వ తేదీన పట్నాల శంకరరావు కిరాణా దుకాణంలో జరిగిన భారీ చోరీని అనకాపల్లి పట్టణ పోలీసులు ఛేదించారు. పట్నాల శంకరరావు వద్ద విజయరామరాజుపేటలో నివసిస్తున్న ప్రతాపరావు దుర్గారావు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. శంకరరావు తన ఇంటి కిందనే కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. దుకాణంలోని దేవుని గదిలోని లాకర్​లో భారీగా బంగారు వస్తువులు ఉంచేవారు. దీన్ని గమనించాడు దుర్గారావు. అదే ప్రాంతంలో నివసిస్తున్న పాత నెరస్థుడు బొచ్చా ఎలియరాజుతో విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి చోరీకి పన్నాగం పన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన దొడ్డి తిమోతి సహకారం తీసుకున్నారు.

అయితే దుర్గారావుకు ఎలియరాజు చోరీ చేయగలడో.. లేదో.. ననే అనుమానంతో ముందు ఏదైనా వస్తువు అపహరించాలని చెప్పాడు. కిరాణా దుకాణానికి పక్కనే ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలోని ఫ్రిజ్​ను అపహరించాడు ఎలియరాజు. తన సెలక్షన్ సరైనదేననుకుని.. దొంగతనం చేయడానికి ప్లాన్ వేశాడు దుర్గారావు. ఏప్రిల్ 25న రాత్రి ఎలియరాజు, దుర్గారావు కలిసి దుకాణంలోకి ప్రవేశించారు. తిమోతి బయట కాపలా కాశాడు.

దుకాణంలో నుంచి 80 తులాలకు పైగా బంగారం, 1.50 లక్షల నగదును అపహరించారు. శంకరరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇంటి దొంగల ప్రమేయం ఉంటుందన్న కోణంలో విచారణ చేపట్టారు. 15వ తేదీన సుంకరమెట్ట రహదారి వద్ద నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బొచ్చా ఎలియరాజు, ప్రతాపరావు దుర్గారావు, దొడ్డి తిమోతి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన 1.50 లక్షల నగదు నిందితులు ఖర్చు చేసినట్లు విచారణ తేలింది.

పాత నేరస్థుడు ఎలియరాజుని మరింత లోతుగా విచారణ చేపట్టగా 2019 ఏప్రిల్​లో గాంధీనగరంలో మంగపూడి లక్ష్మీ ఇంట్లో 3.5 తులాల బంగారం, 1.5 కేజీల వెండి వస్తువులు, 2.5 లక్షల నగదు అపహరించానని ఒప్పుకున్నట్లు అనకాపల్లి ఇన్​ఛార్జి డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెండు తులాల బంగారం, ఎనిమిది వందల గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. భారీ చోరీని చేధించిన అనకాపల్లి పట్టణ పోలీసులకు డీఎస్పీ మహేశ్వరరావు రివార్డు అందజేశారు.

ఇదీ చదవండి:కాసేపట్లో రఘురామ గాయాలపై హైకోర్టుకు చేరనున్న నివేదిక

Last Updated : May 16, 2021, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details