విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గోపాల కృష్ణ అనే యువకుడు.. తన ప్రియురాలు కే. శ్రావణి(27) అనే వివాహితను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పరవాడకు చెందిన గోపాల కృష్ణ .. కే. శ్రావణి అనే వివాహిత ఇద్దరూ కలిసి శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బీచ్‌కు వెళ్లారు. అయితే అక్కడ వారిద్దరికీ మధ్య ఏదో విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు.. గొంతు నులిమి శ్రావణిని దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
కాగా.. మృతురాలు జగదాంబ కూడలిలో ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. హత్య చేసిన ప్రియుడు గోపాలకృష్ణ గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం వంటి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రైలు పట్టాలపై రెండు మృత దేహాలు..మరోవైపు నంద్యాల సమీపంలో రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. నంద్యాల నుంచి గుంటూరు వెళ్లే రైలు మార్గంలో పొన్నపురం సమీపంలోని రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మృత దేహాలను స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఓ అరవై ఏళ్ల వృద్ధురాలు, ఇరవై మూడేళ్ల వయసున్న యువతి ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు జాలర్లు గల్లంతు..పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని పాచిపెంట పెద్ద వాగులో శుక్రవారం సాయంత్రం చేపలు పట్టేందుకు పడవపై వెళ్లిన ఇద్దరు జాలర్లు ఇంతవరకు ఇంటికి చేరుకోలేదు. దీంతో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో బలమైన గాలివీయడంతో పడవ బోల్తా పడటం వల్ల వారిద్దరూ గల్లంతై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిలో ఒకరు పాచిపెంట మండలం మడవలస కు చెందిన బంటు జోగయ్య (48), మరొకరు ఎర్రోడ్లవలస గ్రామానికి చెందిన ఒంగారి సీతారాం(24).
ఇవీ చదవండి: