Ways to let go of fear : భయం ఏదీ లేనట్లుగా బయటకు కనిపిస్తే... అంతా మామూలైపోతుంది అనుకుంటారు కొందరు. కానీ భయం అనేది నిజం. మానసికంగానూ శారీరకంగానూ ఇది మనపై ప్రభావం చూపగలదు. అందుకే ముందు మనం ఆందోళనలో ఉన్నామన్న విషయాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత దాన్ని దాటేందుకు ప్రయత్నించాలి. లేదని మనల్ని మనమే మోసం చేసుకోకూడదు.
మన ఆప్తులు మనకు తోడుగా ఉన్నారనే భరోసా చాలా ధైర్యాన్నిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సమయంలో వారి సాయం తీసుకోవడం అవసరం. మాటద్వారానైనా, స్పర్శతోనైనా వారి నుంచి వచ్చే ఊరడింపు మనలో ఉన్న ఆందోళనలను చాలావరకూ తగ్గిస్తుంది. అందువల్ల ఇతరుల సాయం అడగవచ్చు.
*ఏ పనిచేసినా ముందే పూర్తిగా దానికి సన్నద్ధం కాకపోతే... విఫలమయ్యేందుకు అవకాశాలు పెరగడం మాత్రమే కాదు, ఆ మొత్తం ప్రక్రియ అంతా భయం భయంగా సాగుతుంది. సబ్జెక్టు అంటే భయమైతే.. క్లాసుకు ముందే కొంత చదువుకుని వెళ్లడం, క్యాంపస్ అంటే భయమేస్తుంటే.. ఆ పరిసరాలను ముందే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించడం... ఇలా మనల్ని ఏ అంశం భయపెడుతుంటే దాన్ని ముందే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే చాలావరకూ ఆ భయం మనల్ని వీడిపోతుంది.
*మనం ఏం చేయాలి అనుకుంటున్నామో, అంతిమంగా లక్ష్యం ఏంటో... దాని గురించే ఆలోచించినప్పుడు ఆ దారిలో ఎదురయ్యే చిన్న చిన్న భయాల గురించి పెద్దగా ఆలోచించడం మానేస్తారు. పట్టా పుచ్చుకుని, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో బయటకు రావాలనుకునేటప్పుడు ఆ క్రమంలో కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ధైర్యం తెచ్చుకుంటారు.