సారూ.. మంచినీళ్లూ...! - మధ్యాహ్న భోజనం
తాగడానికి మంచినీళ్లు లేవు. తిన్న కంచాలు కడుగుదామన్నా.. అల్లంత దూరం వెళ్లాలి. మరుగుదొడ్లూ లేవు. అదేమంటే.. ఉన్నతాధికారులకు చెప్పాం.. పరిష్కరిస్తాం అంటారు. కానీ.. ఇన్ని సమస్యలు ఎన్నడు తీరుతాయో తెలియదు. విశాఖ జిల్లా బుచ్చెంపేట పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలివి.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చెంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీటి వసతి సరిగా లేక.. విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. మరుగుదొడ్లు లేని కారణంగా.. విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. ఈ పాఠశాలలో 279 మంది చదువుకుంటున్నారు. వీరి సౌకర్యార్థం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరు.. రెండేళ్ల క్రితమే చెడిపోయింది. నాటి నుంచే స్కూల్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మధ్యాహ్న భోజన అనంతరం కంచాలు శుభ్రం చేసుకునేందుకు.. సమీపంలోని రావణపెళ్లి జలాశయంలో చేరిన కాస్తంత వరద నీటిని వాడుకుంటున్నారు. ఈ మధ్యే తవ్విన నీటి కుంటల్లో దిగి.. ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్కడ.. మధ్యాహ్నభోజన నాణ్యతా అంతంతమాత్రమే. ఉడికీ ఉడకని అన్నం, సరిగా అందని గుడ్లు.. ఇలా.. చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. ఇది తట్టుకోలేని కొందరు పిల్లలు.. ఇంటినుంచి క్యారేజ్ లు తెచ్చుకుంటున్నారు. స్కూలు హెడ్ మాస్టరు మాత్రం.. డీఈవోతో సమస్య గురించి మాట్లాడామని.. త్వరలోనే పరిష్కిరిస్తామనీ చెప్పారు.