Visakhapatnam Fishing Harbour Fire Accident: జీవితాలను చిన్నాభిన్నం చేసిన ప్రమాదానికి కారణాలు ఏంటి? - వారిని ఆదుకునేది ఎవరు? Visakhapatnam Fishing Harbour Fire Accident: ఒక బోట్ తయారు చేయడానికి ఎంతోమంది కష్టపడాలి.. మరెంతో డబ్బు వెచ్చించాలి. అలాంటివి 40కిపైగా కాలిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. మరి అసలు, ఈ ప్రమాదానికి అసలు కారణమేంటి..? నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునే వారు ఎవరు.
ఆకతాయిల పనా.. విధ్వంసకర శక్తుల ఆగడమా.. లేక గంజాయి బ్యాచ్ గందరగోళమా.. వినోదం కోసం కొందరు ఫిషింగ్ హార్బర్‌లో చేసుకున్న పార్టీ వికటించి ప్రమాదం జరిగిందా.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం చుట్టూ అల్లుకుంటున్న అనుమానాలు ఇవన్నీ.
సరిగ్గా అదే రోజు: నవంబర్ 19, 1977 కృష్ణా జిల్లా దివిసీమ తుపాను ధాటికి సమీపంలోని 40 గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. వేల మందిని పొట్టనపెట్టుకున్న ఈ తుపాను భీభత్సం మత్స్యకారులందరికి ఒక చేదు అనుభవం. సరిగ్గా అదే రోజు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదం 40కి పైగా బోట్లను భస్మీపటలం చేయడం మత్స్యకారులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఎందుకంటే ప్రతిసారి ప్రమాదాల్లో ఇబ్బందులు పడుతోంది మత్స్యకారులే. ఇప్పుడు కూడా అదే మత్స్యకారుల బతుకులను అగ్నిప్రమాదం నాశనం చేసింది.
దేశంలో ఫిషింగ్ హార్బర్లలో విశాఖకు ఓ ముఖ్య స్థానం ఉంది. మేజర్ పోర్టుకు ఆనుకునే ఉన్నఈ హార్బర్ నుంచి నిత్యం వందల సంఖ్యలో మర బోట్లు చేపల వేటకు వెళ్తాయి. ఒక్కో బోటు దాదాపు ఏడుగురు నుంచి 15 మంది సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే మత్స్యకారులు ఏడు నుంచి పది రోజుల పాటు బంగాళాఖాతంలోనే ఉండి.. చేపల వేట కొనసాగిస్తారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో.. ఒకసారి సముద్రంపైకి వెళితే మళ్లీ తిరిగి వచ్చే వరకు ఇంటి వద్ద ఉన్నవారికి గుబులే. ఇక సముద్రంపై మత్స్యకారులు వేట సమయంలో ఎదుర్కొనే సవాళ్లకు అంతేలేదు. సముద్రుడిపై భారం వేసి ముందుకు సాగాల్సిందే.
అగ్నిప్రమాదంతో రోడ్డునపడ్డ వందలాది కుటుంబాలు - న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్న బాధితులు
అయిదు దశాబ్దాలుగా హార్బర్‌లో సందడి: బ్రిటిష్ కాలంలో విశాఖకు బెస్తవారి పల్లెగా ఒక ముద్ర ఉండేది. అప్పటికి భీమునిపట్నం పెద్ద పోర్టుగా విరాజిల్లేది. చేపలు పట్టే కార్యకలాపాలన్నీ సంప్రదాయ మత్స్యకారులు చూసుకునేవారు. వీరి నివాసాలన్ని సముద్రతీరాన్ని అనుకుని ఉండేవి. తర్వాత కాలంలో డాల్ఫిన్స్ నోస్ సహజ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు కార్యకలాపాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా 1975లో ఫిషింగ్ హార్బర్ రూపుదిద్దుకుంది. వీరంతా ప్రస్తుతం వన్ టౌన్, పెద జాలరిపేట, వాల్తేర్ లాంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
దాదాపు ఐదు దశాబ్దాల నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులు వేటాడిన ఉత్పత్తుల విక్రయాలు, బోట్ల రాకపోకలు.. ఇలా నిత్యం సందడిగా ఉంటుంది. తెల్లవారుజాము నుంచే ఇక్కడ చేపల విక్రయాలు జరుగుతుంటాయి. ఒక బోటు వేట పూర్తి చేసుకుని సరకుతో వచ్చిందంటే వాటి చుట్టూ కొనుగోలుదారులు చేరి బేరమాడుతారు.
ఇలా నిత్యం ఇక్కడ కోలహలంగా ఉంటుంది. హర్బర్‌లో రోజూ భారీగానే లావాదేవీలు జరుగుతాయి. పైగా పెద్ద ఆపరేటర్లు కూడా ఇక్కడే ఉండడం, శీతల సదుపాయాలు వంటివి అందుబాటులో ఉండటం కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఇన్ని వెసులు బాట్లు ఉండటంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ఈ ఫిషింగ్ హర్బర్ ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 40 బోట్లు
పార్టీనే కొంపముంచిందా: ఈ హార్బర్‌లో ఆధికారికంగా నమోదైన బోట్ల సంఖ్యే ఎనిమిది వందలు దాటింది. నిత్యం దాదాపు వందల బోట్లు ఇక్కడ లంగర్ వేసి ఉంటాయి. దీనికి అనుకునే మేజర్ పోర్టు కంటైనర్ టెర్మినల్ కూడా ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ నుంచి సాధారణ పర్యాటకుల బోట్లను కూడా పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఇలా ఉండగా.. ఆదివారం రాత్రి ఒకవైపు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో నగరం ఊగిపోతుంది. దీనికోసం ఆర్కే బీచ్‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వీక్షించారు.
ఇదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న ఫిషింగ్ హార్బర్‌లో రాత్రి 11 గంటల ప్రాంతంలో తొలుత ఒక బోట్‌లో మంటలు వచ్చినట్టుగా గుర్తించారు. క్షణాల్లో మిగిలినవాటికి ఇవి విస్తరించడంతో అంతా తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, కొంతమంది రాత్రి పార్టీ చేసుకుని మద్యానికి నిప్పు అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు గంజాయి ముఠాలు ఏమైనా దీనికి కారణమా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ చేపట్టారు.
ఒక ఫిషింగ్ బోట్ నిర్మించడానికి కలప, ఇతర సామగ్రి, లేబర్ కలిసి దాదాపు 50లక్షల రూపాయిల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. ఒక్కో బోట్ పైనా ప్రత్యక్ష్యంగా ఏడు నుంచి పదిహేను మంది వరకు వేటకు వెళ్తారు. వేటాడి తెచ్చిన సరకు విక్రయం, రవాణా ఇలా పలు అంశాలతో కూడిన కార్యకలాపాల వల్ల మరో పది నుంచి 15 మందికి ఉపాధి లభిస్తుంది. ఇలా ఎప్పుడూ మత్స్యకారులు,వ్యాపార వర్గాలతో కళకళలాడే హర్బర్.. భారీ ప్రమాదంతో ఒక్క సారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ ఫిషింగ్ హార్బర్‌లో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. బోట్లలోని భారీ డీజిల్ నిల్వలు, నిండు సిలిండర్ల కారణంగా ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం - మత్స్యకార్మికులను ఆదుకోవాలన్న లోకేశ్
ప్రమాద తీవ్రత పెరగడానికి అదే కారణమా:హార్బర్‌లో బోట్లు అన్నీ ఒకదానిని మరొకటి అనుకుని ఉంటాయి. అవి ఒడ్డుకి రాగానే లంగరు వేసి ఉంచాలనే నిబంధన కారణంగా వాటని ఒక వరస క్రమంలో పెడుతారు. తెల్లవారుజామున వేటకు వెళ్లారు అంటే.. ముందురోజు సాయంత్రానికి అంతా సిద్ధం చేసుకుంటారు. ప్రతి బోటులోనూ దాదాపు వెయ్యి నుంచి నాలుగువేల లీటర్ల వరకు డీజిల్ నింపుకుని వేట అయిపోయేంత వరకు ఇంధనం కొరత లేకుండా చూసుకుంటారు. ఇదే సమయంలో బోటులోనే వంటకు అనువుగా గ్యాస్ సిలిండర్లు కూడా రెండు వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వేటకు సిద్ధమైన బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో దాదాపు ఐదునుంచి ఎనిమిది వరకు ఉన్నాయి.
మిగిలిన వాటిల్లోనూ కనీసం బోటు నడవడానికి కావాల్సిన ఇంధనం ఉంది. ఫలితంగా ఒక బోటు అంటుకోవడంతో గాలి తీవ్రత ద్వారా క్రమంగా మిగిలిన వాటికి కూడా వ్యాపించాయి. ఆదివారం సాయంత్రమే వేట నుంచి తిరిగి వచ్చిన బోట్లతో ఉన్న సరకు కూడా అగ్నికి ఆహుతైంది. దాని విలువ భారీగానే ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. తమ జీవనోపాధి.. అమ్ముకోవాల్సిన సరుకు రెండు కాలిపోవడంతో వీరు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరకుంటున్నారు.
పరిహారం ఇవ్వడమే కాకుండా హార్బర్ కార్యకలాపాలు ఎంత త్వరగా తిరిగి ప్రారంభిస్తే తమకు అంతా ఉపశమనం కలుగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాల వల్ల తమ బోట్లు నిలిపే స్థలం ఇరుగ్గా మారిందని, ఈ సమస్యను పరిష్కారించాలని ఎప్పటి నుంచో మత్స్యకారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇది కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి తోడైందన్నది వారి వాదన.
నేడు మత్స్యకార దినోత్సవం - వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపిన అగ్నిప్రమాదం
జీవితాలు మారుతాయి అని అనుకునే లోపే:విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం ఇక్కడ సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులకు 153 కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తోంది. ఆ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన తర్వాత ఇటీవలే అదనపు నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. తమ జీవితాలకు ఇది ఉపకరిస్తుందని ఆనందించేలోపే జరగాల్సిన నష్టం జరిగి మత్స్యకారుల నడ్డి విరిగింది.
40కి పైగా బోట్లు కాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మత్య్సకారులు ఉన్నారు. తూర్పు తీరంలో మత్స్యకారుల సంప్రదాయ వృత్తి చేపల వేటకు.. కీలకమైన విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కొత్త పాఠాలను చెబుతోంది. ఈ ప్రాంతంలో నిఘా పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. మరి, అధికారులు, ప్రభుత్వాలు ఇకనైనా మారేనా అన్నది కాలమే చెప్పాల్సిన సమాధానం.
ఫిషింగ్ హార్బర్ ప్రమాదం దురదృష్టకరం - బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి