విశాఖ జిల్లా కశింకోట మండలం బంగారయ్య పేట మధుపర్కాల నేతకు పెట్టింది పేరు. ఇక్కడ నేసిన మధుపర్కాలు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. కరోనా లాక్డౌన్ కారణంగా వివాహాలు నిలిచిపోవటం వల్ల వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. వేసవి వచ్చిందంటే వస్త్ర నేతతో కళకళలాడే మగ్గాలు.. మూగబోయాయి. ఎంతో శ్రమతో కూడుకున్న మధుపర్కాలను అలవోకగా నేసే ఈ నేతన్నలు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రమతో కూడిన వస్త్ర తయారీలో ఇక్కడి చేనేత కార్మికులు చూపుతున్న చొరవ పలువురి ప్రశంసలు అందుకుంటున్నా... తమ బతుకుల్లో మాత్రం వెలుగు లేదని పలువురు చేనేత కార్మకులు వాపోతున్నారు. శ్రీ సాంబమూర్తి చేనేత సహకార సంఘంలో గతంలో 350 మంది సభ్యులుగా ఉండేవారు. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాక చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిపోయాయి. ప్రస్తుతం 150 కుటుంబాలు మాత్రమే ఈ సంఘంలో ఉన్నాయి.
మగ్గం నేసేవారికి రోజుకు రూ.200 మాత్రమే వస్తుండగా మర్రాష్, కండ్లు చుట్టడం, డబ్బాలు తొడడం చేసేవారికి రూ.20 నుంచి రూ.70 వరకు ఆదాయం వస్తుంది. ముడి సరకు ధరలు పెరిగిపోతున్న సమయంలో... వచ్చే అరకొర ఆదాయం సరిపోవడంలేదని నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో కరోనా లాక్డౌన్ తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు.