AU VC attend YSRCP party meeting : విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజీల కరస్పాండెంట్స్, అధ్యాపకులతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, మూడు జిల్లాల సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. వారి పక్కనే ఆంధ్ర విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్, ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి ఉండగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఉపకులపతి పార్టీ సమావేశంలో పాల్గొనడమే గాకుండా ఒక అభ్యర్థి వైపు ప్రచారం చేయడం ముమ్మాటికీ దారుణమని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాందోళన పసిగట్టిన సమావేశం నిర్వాహకులు.. ఉపకులపతి ప్రసాద్ రెడ్డిని వేరొక మార్గం ద్వారా హోటల్ నుంచి బయటకు పంపించారు. సమావేశం జరుగుతున్న హాల్ వద్దకు మీడియా ప్రతినిధులు రాకుండా తలుపులు వేసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నాయకులను వేరే మార్గంలో పంపించి వేశారు.
నిలదీసిన ప్రజాసంఘాలు... ప్రజాసంఘాల ప్రతినిధులు నేరుగా సమావేశం జరుగుతున్న హోటల్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ పెద్దలను నిలదీశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితై విద్యావంతులైన పట్టభద్రులు చూస్తూ ఊరుకోరని.. తగిన బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. కాగా, నిరసన తెలిపిన ప్రజాసంఘాల నాయకులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులను ఓట్ల కోసం పార్టీ నేతలు, ఏయూ వీసీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
అధికార దుర్వినియోగం... అధికార పార్టీ పూర్తిగా కోడ్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు. ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపకులపతిగా ఉంటూ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు వాలంటీర్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకొని ఎన్నికలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిస్పాక్షికపతంగా ఎన్నికలు జరగాలని కోరారు.
ఈ ఘటన జరుగుతున్న సమయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలోనే ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ప్రచారంలో పాల్గొనడం తనదృష్టికీ రాలేదని అన్నారు. వెనువెంటనే... అసలు అది పార్టీ సమావేశం కాదని బుకాయించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మీద ప్రతిపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేయడం పరిపాటే అని కొట్టిపారేశారు. ఇంకాస్త ముందడుగు వేసి మీడియా ప్రతినిధులను... వీసీ ప్రసాద్ రెడ్డిని మీరు చూశారా అని ప్రశ్నించారు. వాస్తవంగా వీసీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే, ఆ విషయం ఎన్నికల సంఘం చూసుకుంటుదని మంత్రి బొత్స తనదైన తీరులో సమాధానం చెప్పారు.