చిన్న వయసులో వివాహం.. కోటి ఆశలతో అత్తారింటికి వెళ్లిన ఆమెకు అక్కడ నిత్యం వేధింపులు, భర్త నిరాదరణ వెరసి జీవితంపై విరక్తి పెంచాయి. అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేయడమే కాకుండా అప్పు చేసి మరీ భారీగా నగదు, బంగారం ఇచ్చిన తల్లిదండ్రుల కష్టం ఆమెను మానసికంగా కుంగదీసింది. తాను పడ్డ వేదనకు 50 పేజీల అక్షర రూపం ఇచ్చి మరీ.. కనిపించకుండా పోయింది. విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయిదు రోజులైనా ఎటువంటి ఆచూకీ తెలియక పోవటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
అనకాపల్లి నుంచి మునగపాడు క్రాస్ రోడ్డుకు చేరుకున్న ఆమె అక్కడ ఏడుస్తూ ఉండగా స్థానిక మహిళ ఒకరు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచి ఆమె రాజమండ్రిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. వారి ఇంటికి తాళం వేసి ఉండడంతో అక్కడినుంచి విజయవాడలో వెళ్లి మళ్లీ రాజమండ్రి వచ్చింది. ఈ సమయంలో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో బంధువులకు ఆచూకీ తెలియలేదు. మంగళవారం రాత్రి రాజమండ్రి నుంచి తన చిన్ననాటి నేస్తానికి ఫోన్ చేసి.. ' తాను గోదాట్లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని, చివరిసారి నీతో మాట్లాడాలని పించిందని' చెప్పింది. అప్పటికే విషయం తెలిసిన స్నేహితురాలు ఆమెను మాటల్లో పెట్టి రాజమండ్రిలో ఉన్న బంధువులకు సమాచారం అందించింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించి విశాఖ జిల్లాలోని పుట్టింటికి తీసుకొచ్చారు.