వైకాపా ప్రభుత్వ పాలన రెండేళ్లు దాటినా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయలేదని, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని తెదేపా నేతలు మండిపడ్డారు. జిల్లాల్లో జనం సమస్యలేంటి? పెండింగులో ఉన్న పనులేంటి? ప్రభుత్వం ఏం చేసిందనే అంశాలపై త్వరలో బస్సు యాత్ర చేపట్టి ప్రజలకు వివరించాలని, ఆయా పనులను పరిశీలించాలని నిర్ణయించారు.
‘ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశం మీద పోరాడేలా ప్రజలను చైతన్య పరుస్తాం’ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర రక్షణ- చర్చావేదిక’ పేరిట సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెదేపా హయాంలో తారకరామ, జంఝావతి, పెద్దగెడ్డ, వంశధార, నాగావళి వంటి ఎన్నో ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేశామన్నారు. నదుల అనుసంధానానికి పూనుకుని శ్రీకాకుళంలో వంశధార- నాగావళిని కలిపే పనులు చేపట్టామని తెలిపారు. వంశధారను బాహుదా నదికి అనుసంధానం చేయడానికి రూ.5 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఏ పనీ చేయలేదని విమర్శించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తెదేపా హయాంలో టెండర్లు పిలిస్తే... వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసి రివర్స్ టెండర్ పిలిచినా ప్రారంభించలేదని చెప్పారు. ‘10 శాతం పనులు చేస్తే వంశధార, 5 శాతం చేస్తే తోటపల్లి పరిధిలో పెండింగు పనులు పూర్తవుతాయి. ఏమీ చేయకుండా ఇక్కడి ప్రాజెక్టులను విస్మరించారు. తెదేపా హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి మేం పనులు మంజూరు చేయించుకునేవాళ్లం. ప్రస్తుత ఉత్తరాంధ్ర మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి ప్రజల సమస్యలపై మాట్లాడగలరా? వీరంతా పేరుకే మంత్రులు. సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి హోదా కలిగినవారు పాల్గొన్నా మరొకరు వచ్చి సమీక్షిస్తుంటే ఆ మంత్రి పదవి ఎందుకు? వివిధ కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖకు ఎందుకు పంపారు? అశోక్‌గజపతిరాజుపై విమర్శలు చేయడానికా? విశాఖ-భీమిలి మధ్య స్థలాలు ఆయన బంధుగణం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది’ అని ఆరోపించారు.