రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు విశాఖ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కూరగాయల్లా ఇసుకను కేజీల లెక్కన అమ్ముతూ.. బేరాలాడుతూ ఆందోళన చేశారు. 'నోట్లో మట్టి కొట్టు పాత సామెత-నోట్లో ఇసుక కొట్టు అనేది కొత్త సామెత' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక కొరత వల్ల సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వైకాపా ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దిగజారిందని విమర్శించారు. ఇసుక రీచుల్లో వైకాపా కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదు రూపాయలకే కేజీ ఇసుక - ధర్నా
'రండి బాబూ రండి ఇక్కడ కేజీ ఇసుక 5 రూపాయలే' అంటూ అమ్మేవారు. '5 రూపాయలా.. ఇంకేమి తగ్గేది ఉండదా' అంటూ కొనేవారు. ముందు రండి స్వామి తర్వాత చూద్దాం అంటూ కేకలు. ఏంటిది అనుకుంటున్నారా! కొత్త ప్రభుత్వ ఇసుక విధానంపై తెదేపా నేతల ఆందోళన తీరిది.
'రండి.. రండి.. ఇసుక కేజీ 5 రూపాయలే'