విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని తెదేపా నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే ఇవ్వాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశించారు. నగదును మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. ఈ దుర్ఘటనలో విష వాయువుల కారణంగా 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలకు తలా 50 వేల చొప్పున 7.50 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో సోమవారం నాటికి జమ చేయనున్నారు.
స్థానిక శాసనసభ్యుడు గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పార్టీ నాయకులు మృతుల కుటుంబాలను కలిసి ఆర్థిక సాయంపై చంద్రబాబు లేఖను అందజేశారు. గ్యాస్ లీకేజీ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేయాల్సిందిగా విశాఖ పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.