అక్టోబర్ 3, 4 తేదీల్లో జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల కోసం తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఏకే. త్రిపాఠీ ప్రకటించారు. ఇచ్ఛాపురం - విశాఖ, కొరాపుట్-విశాఖ, కొరాపుట్ - కటక్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఆయన వెల్లడించారు.
ఇచ్ఛాపురం - విశాఖ రైలు
అక్టోబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఇచ్ఛాపురంలో బయలుదేరే మెమూ ప్యాసింజర్ రైలు అదే రోజు రాత్రి 8.15కి విశాఖ చేరనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణం 4న రాత్రి 7.30కు విశాఖలో బయలుదేరి 11.30 గంటలకు ఇచ్ఛాపురం చేరుతుందన్నారు. సోంపేట, పలాస, నౌపడా, కోటబొమ్మాళి, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్త వలస స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని త్రిపాఠి పేర్కొన్నారు. మొత్తం 12 కోచ్‌లతో ఈ రైలును నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
కొరాపుట్ - విశాఖ రైలు..
కొరాపుట్ - విశాఖల మధ్య నడిచే ఈ రైలు 3 తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు కొరాపుట్‌లో బయలుదేరి రాత్రి 7.55 నిమిషాలకు విశాఖ చేరుతుందని త్రిపాఠి వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో 4న రాత్రి 9.40 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.40 గంటలకు కొరాపుట్ చేరుతుందని వివరించారు. దామన్ జోడి, లక్ష్మీపూర్ రోడ్, తికిరి, సింగపూర్ రోడ్, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుందన్నారు. 12 సెకెండ్ క్లాస్ కోచ్‌లతో పాటు, రెండు బ్రేక్ వ్యాన్లు కూడా ఈ రైలుకు జతచేస్తున్నట్లు చెప్పారు.