School Radio: ఈమె పేరు గాలి అరుణ. పిల్లల్లో వినూత్న ఆలోచనలు ప్రోత్సహించడమంటే ఈమెకు ఎంతో ఇష్టం. ఆ మక్కువే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది. విద్యార్థుల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఓ స్కూల్ రేడియోను 2015లో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 వేల మందికి ఈ మాధ్యమాన్ని చేరువ చేశారు. 5 రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్కూల్ రేడియో గుణాత్మక మార్పునకు నాంది పలుకుతోంది.
రెండున్నర దశాబ్దాలకు పైగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో గాలి అరుణ పాలు పంచుకున్నారు. యునిసెఫ్ వంటి సంస్థలతో పాటు బాలల కార్యక్రమాల కోసం పనిచేశారు. ఆ అనుభవంతో పిల్లల్లో బిడియాన్ని పోగొట్టడం, ఊహాశక్తి, కల్పనా చాతుర్యం పెంపొందించేందుకు స్కూల్ రేడియోను ఆరంభించారు.