సంక్రాంతికి ముందు ఇళ్లకు వెళ్లేవారు, పండగ తరువాత తిరుగు ప్రయాణం చేసేవారి కోసం విశాఖ జిల్లా ఆర్టీసీ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు ఇప్పటినుంచే చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల నిరీక్షణకు తావులేకుండా ఎప్పటికప్పుడు పంపించేలా, రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచడం, తగ్గించడం చేయనున్నారు. ప్రస్తుతానికి వెయ్యి బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళిక చేశారు.
8వ తేదీ నుంచి..
ఈ నెల 9వ తేదీ రెండో శనివారం, 10 ఆదివారం సెలవులు అవడంతో అప్పటి నుంచే ఎక్కువ మంది సెలవులు పెట్టి ఊళ్లకు పయనమవుతారు. ఈ నేపథ్యంలో ఈనెల 8 నుంచే దూర ప్రాంతవాసుల కోసం బస్సులు నడపనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం ప్రాంతాల నుంచి విశాఖకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరం, సోంపేట, శ్రీకాకుళం, రాజాం, కాకినాడ, రాజమండ్రి, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు వెళ్లేవారి కోసం అదనపు సర్వీసులు వేస్తున్నారు. 11, 12, 13 తేదీల్లో విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లే వారు అధిక సంఖ్యలో ఉండనుండడంతో ఆ మూడు రోజుల కోసం 500 బస్సులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి ప్రత్యేక బస్సులు
దూర ప్రాంతాల సర్వీసులకే అదనపు ఛార్జీలు
సంక్రాంతి కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు సగం ఛార్జి అదనంగా పెంచనున్నారు. పండగ ముందు, తరువాత దూర ప్రాంతాల నుంచి వచ్చి, వెళ్లే సర్వీసులకు మాత్రమే ఈ అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, అమలాపురం, భీమవరం వంటి ప్రాంతాలకు వేసే ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ ఛార్జీ ఉంటుంది. ఈ రూట్లలో ముందు రోజు బస్సులు ఖాళీగా వెళ్లే అవకాశం ఉండనుండడంతో అదనపు ఛార్జీలు ఉంటాయంటున్నారు.
ఆన్‌లైన్ బుకింగ్...
కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేయించుకునేలా చైతన్యం తీసుకువస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెట్టిన బస్సులు నిండిపోతే ఆ వెంటనే మరికొన్ని సర్వీసులు పెట్టి సీట్లను అందుబాటులో ఉంచనున్నారు. అధికారులు సైతం ఆన్‌లైన్ టికెటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. టిక్కెట్లు తీసుకునేవారు www.apsrtconline.in లో బుక్ చేసుకోవాలి. రద్దీ నియంత్రణ, కాంప్లెక్స్‌ల్లో పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు, ఇతర అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచనున్నారు.
ఇదీ చదవండి: బుక్ చేసుకున్న బస్ మిస్సయితే తర్వాత వచ్చే సర్వీస్‌లో వెళ్లొచ్చు