CMO Key Role In Issuance Of NOC: ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు డీఫాం భూములు ఇచ్చినట్లు అధికారికంగా నిర్ధారించే రికార్డే లేదు. ఒరిజనల్ డీఫాం పట్టాలు లేవు. అవి నకిలీ పట్టాలు మొర్రో అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నివేదికలు పంపినా దిక్కు లేదు. ఉన్నతస్థాయి ప్రమేయంతోనే ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. 2006లో పదెకరాల వ్యవసాయ భూమి కేటాయించి... 2008లో అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయించినా.. ఆ స్థలాలను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నా.. వాళ్ల వారసులు ఇప్పటికీ నిరుపేదల్లా బతుకుతున్నారంటే అసలేం జరిగిందో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. డీఫాం పట్టా లేకపోయినా, నకళ్లతో దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైన లబ్ధిదారులు... సీఎంవోలో దరఖాస్తులివ్వగానే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలొచ్చి.. ఉరుకులు పరుగులమీద ఎన్వోసీలు జారీ అయ్యారంటే ఏం జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇలాంటి చిత్రవిచిత్రాల మధ్య నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతో చేతులు మారిన భూములు అచ్చంగా 25.79 ఎకరాలు. ఈ భూములు ఎక్కడో మారుమూల పల్లెల్లోనివి కాదు.. ప్రస్తుతం విశాఖ నగరంలో భాగమైన భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో.
మూడేళ్లలోనే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం: సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ భూమి కేటాయిస్తే, డీఫాం పట్టా ఇస్తే.. అమ్ముకోవడానికి కొన్నేళ్లు ఆగాలి. కానీ 2006లో కాపులుప్పాడ వద్ద 10 ఎకరాల భూమి స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పేరుతో కేటాయించి.. మూడేళ్లయినా కాకుండానే అమ్మేసుకున్నారు. దాదాపు 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎంత సులువుగా కేటాయించారో, అడ్డగోలుగా అమ్ముకోవడానికి ఎలా అనుమతిచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. ఈ వ్యవహారంలో నాటి అధికారులు, ప్రభుత్వ స్థాయిలో అనధికారుల పాత్రపై విచారణ చేయించాలని సిట్ సిఫారసు చేసింది. అప్పటి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి వెంకటసుబ్బయ్య తప్పుడు నోట్ పెట్టినట్లు అనుమానం వ్యక్తంచేసింది. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన భూమి ఎసైన్‌మెంట్‌కు దోహదపడ్డారని పేర్కొంది.
సరైన క్రిమినల్ విచారణ జరిపితే... తెరవెనుక వ్యక్తులను బయటికి తేవచ్చని సూచించింది. ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం కాకుండా, దళారులే లాభపడ్డారని తేల్చిచెప్పింది. ఈ కేసులో స్వాతంత్య్ర సమరయోధుడు రంగూరి అప్పారావు భార్య రంగూరి మీనాక్షి పేరుతో రెండుచోట్ల విడివిడిగా 2.99 ఎకరాలు, 7.01 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిపాదనను అనేకసార్లు జేసీలు తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఎసైన్‌మెంట్ కింద విశాఖలో వ్యవసాయ భూమి కేటాయించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ... ఆ దరఖాస్తును కలెక్టర్ అప్పారావు రెండుసార్లు తిరస్కరించారు.
ఆ తర్వాత రంగూరి మీనాక్షి పేరుతో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందింది. మంత్రి కలెక్టర్‌కు పంపారు. కలెక్టర్ తిరస్కరించినా ప్రత్యేక కేసుగా పరిగణించిన ప్రభుత్వం.. ఆమెకు భూమి కేటాయించింది. 2006 జూన్ 4న పట్టా, జూన్ 8న పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చేశారు. మీనాక్షి పేరుతో కేటాయించిన పదెకరాల భూమిని అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముందే తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని హైదరాబాద్‌లోని ACB ఏసీపీ సంపత్‌కు లేఖ వెళ్లింది.
ఈ భూమి అమ్ముకుంటానంటూ 2007 ఏప్రిల్‌లో మీనాక్షి పేరుతో సీఎంవో కు దరఖాస్తు అందింది. దాన్ని అప్పటి జిల్లా కలెక్టర్‌కు పంపారు. వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్న మీనాక్షి... చిట్టివలసలో మూడో కుమారుడు విశ్వేశ్వరరావు వద్ద ఉంటున్నారని భీమునిపట్నం తహసీల్దారు నివేదించారు. స్వాతంత్య్ర సమరయోధులు పదేళ్ల తర్వాత భూమి అమ్ముకునేందుకు అర్హత ఉంటుందని, కానీ భూమి కేటాయించి ఏడాది మాత్రమే అయిందని 2007 నవంబరు 29న సీసీఎల్ఏకి కలెక్టర్ నివేదించారు. అయినా ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ భూమి అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం మెమో ఇచ్చింది.
ఈ భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, భీమునిపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలివ్వాలని... మామపల్లి లక్ష్మి, భాస్కరరావు, విశ్వేశ్వరరావు, రత్నం అనే వ్యక్తులు కలెక్టర్‌ను కోరారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, అమ్ముకునేందుకు కలెక్టర్ వీలు కల్పించారు. 2008 మార్చిలో మీనాక్షి చనిపోగా, ఆమె వారసులు అదే ఏడాది ఆగస్టులో పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించారు. ఆ భూములను కొవ్వూరు వెంకట సత్యనారాయణరెడ్డి, మంతెన నాగమణి మూడెకరాల చొప్పున, పెన్మత్స సత్యనారాయణరాజు, ఇందుకూరి కృష్ణంరాజు రెండెకరాల చొప్పున కొన్నారు.
ఆ భూములు తమవంటూ కడప జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ బోర్డులు పెట్టారని సిట్ గుర్తించింది. 60 కోట్ల విలువైన భూమిని అమ్మిన రంగూరి మీనాక్షి వారసులు.. ఇప్పటికీ చిన్నచిన్న పనులు చేస్తూ బతుకు బండి లాగుతున్నారని తేల్చింది. ఇక్కడ అసలు లబ్ధిదారులు వేరని గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలు సడలించడం ద్వారా 80 ఏళ్ల మీనాక్షికి 10 ఎకరాల ఎసైన్డ్ భూమి కేటాయింపు, అమ్మకం వ్యవహారమంతా పూర్తిగా బయటి వ్యక్తులే నడిపించారని సిట్ తేల్చింది.
నకిలీపట్టాలని అనుమానించినా.. భూమి అమ్మకాలకు అనుమతి: కాపులుప్పాడలోనే మరో అయిదెకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. నకిలీ పట్టాను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే ఎన్వోసీలు జారీ అయ్యాయని సిట్ తేల్చింది. విశ్రాంత సైనికోద్యోగి అయిన తన భర్త తిరుమలశెట్టి మోహన్‌బాబుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆయన చనిపోయినందున స్థలం అమ్మకానికి ఎన్వోసీ ఇవ్వాలంటూ తిరుమలశెట్టి శివకామేశ్వరి పేరుతో జిల్లా అధికారులకు దరఖాస్తు అందింది. జిల్లా అధికారులు అది నకిలీ పట్టాగా అనుమానించి ససేమిరా అన్నారు.