విద్యుదుత్పాదనలో సరికొత్త సీలేరు జలవిద్యుత్ కేంద్రం రికార్డు సృష్టించింది. కేంద్ర విద్యుత్తు అథారిటీ జెన్‌కోకు ఇచ్చే లక్ష్యాన్ని 90 రోజుల ముందే చేరుకోవడంతో విద్యుత్కేంద్రం అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విద్యుత్తు అథారిటీ ఏటా నిర్దేశించిన లక్ష్యాలను ఆయా జలవిద్యుత్కేంద్రాలు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా చేరుకోవాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 420 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా.. సీలేరు జలవిద్యుత్ బుధవారం అర్ధరాత్రికి 421.29 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. సీలేరు కాంప్లెక్స్‌లోని మిగతా జలవిద్యుత్కేంద్రాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.
అవరోధాలను అధిగమించి
ఈ ఆర్థిక సంవత్సరంలో సీలేరు జలవిద్యుత్ కేంద్రం అనేక అవరోధాలను ఎదుర్కొంది. తరచూ యూనిట్లు మరమ్మతులకు గురవడంతో విద్యుదుత్పత్తికి అవాంతరాలు ఎదురయ్యేవి. అత్యవసర సమయాల్లో విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితులూ నెలకొన్నాయి. రెండేళ్లుగా మొదటి యూనిట్ పలుమార్లు సాంకేతిక లోపంతో మూలకు చేరింది. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చినా.. కొన్నాళ్లకే మొరాయించేది. ఈ ఏడాది సీలేరు జలవిద్యుత్కేంద్రం లక్ష్యసాధనలో వెనుకబడుతుందని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవరోధాలను అధిగమించి 90 రోజుల ముందుగానే లక్ష్యం చేరుకుంది. ఇంజినీర్లు, సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది.