రానున్న రోజుల్లో విషజ్వరాల బారినపడి ఒక్క మరణం కూడా సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, వైద్య, పంచాయతీ శాఖ అధికారులతో ఆళ్ల నాని సమావేశమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సేవలు, ఆసుపత్రులలో మౌలిక వసతులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్‌లు పాల్గొన్నారు.
పాడేరులో వైద్యకళాశాల ఏర్పాటు: మంత్రి ఆళ్లనాని
రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్ని విమర్శలు వచ్చినా పాడేరులో కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారని మంత్రి ఆళ్లనాని చెప్పారు. వర్షాకాలం రాబోతోందని కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన గ్రామాలు చాలా దూరంగా ఉంటాయని... కాబట్టి అవసరమైన చోట్ల ప్రాథమిక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు..
రాష్ట్ర వ్యాప్తంగా జులై 8వ తేదీ నాటికి 108, 104 వాహనాలు మొత్తం 1,005 ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందని మంత్రి ఆళ్లనాని అన్నారు. వాహనాల కేటాయింపులో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాలలో రహదారుల ప్రాముఖ్యతపై ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్ శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలిపారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ క్లినిక్ లు పనిచేస్తాయని, శ్రీకాకుళం విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజనుల కోసం సహాయ కేంద్రాలుగా ఎస్.టి. సెల్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.