సోమవారం నుంచి మావోయిస్టు పార్టీ ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహించనున్నారు. పీఎల్‌జీఏ స్థాపించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో... మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏవోబీలో పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మన్యం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా సీఆర్‌పీఎఫ్ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు.
కాఫీ తోటలను పంచాలనే నినాదాన్ని గిరిజనుల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న వ్యూహంతో... మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ... పలుచోట్ల కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల కొండజర్త, పేములగొంది అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనకు నిరసనగా... మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేశాయి.