AP Financial Situation: ఈ నెలలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకుల్లో కూరుకుపోయింది. మళ్లీ ఓవర్‌డ్రాఫ్ట్ ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. తొలి పది రోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితి ఒకవైపు ఏర్పడగా.. ఓవర్‌డ్రాఫ్ట్ గడువు మీరిపోతుండటంతో ప్రభుత్వ ఖాతాలు స్తంభింపజేసే సవాలు మరోవైపు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ల సాయంతో కొంత రుణం తెచ్చి, ఓవర్‌డ్రాఫ్ట్‌కు అవసరమైన సొమ్ము చెల్లించి.. ఆ పరిస్థితి నుంచి బయటపడింది.
రిజర్వుబ్యాంకు తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజులే ఓవర్‌డ్రాఫ్ట్ నుంచి బయటపడినట్లు సమాచారం. మళ్లీ వెంటనే ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా 36 రోజులకు మించి ఓడీలో ఉండేందుకు అవకాశం లేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులు ఓడీలోనే ఉంది. ఒకవైపు బహిరంగ మార్కెట్ రుణాలకు అవకాశం లేదు. రోజువారీ రాబడి ప్రభుత్వ అవసరాలకు చాలట్లేదు. డిసెంబరు 29 వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని రిజర్వుబ్యాంకు అంటోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి రిజర్వుబ్యాంకు సోమవారం అందించిన వర్తమానం ప్రకారం.. ఈ నెల 13 నుంచి రాష్ట్రం ఓడీలోనే ఉంది. డిసెంబర్ 17 నాటికి 2వేల 162.84 కోట్ల ఓడీలో ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల తొలి 20రోజుల్లో దాదాపు 14 రోజులకు మించి రాష్ట్రం ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉండటం గమనార్హం. దాదాపు ఈ నెలంతా ఇవే కష్టాలు తప్పేలా లేవని నిపుణులు చెబుతున్నారు.