ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల కోసం పాడేరులో మహిళల అగచాట్లు - house place allocation in hill station news

వైఎస్సార్​ పథకం కింద పక్కా ఇళ్లు కట్టించి ఇస్తారని ఆశపడ్డారు. కనీసం స్థలాలు కేటాయించి.. సాయం అందిస్తే చాలనుకున్నారు. కానీ ఆ ఇచ్చే స్థలాలు కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు వాటిని చదును చేసుకోటానికే సమయం సరిపోతోంది. ఇది చాలదన్నట్టు.. వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు వివాదాస్పద ప్రాంతాలు. ఫలితంగా.. ఎటూ తోచని పరిస్థితిలో విశాఖలోని పాడేరులో గిరిజనులు తలపట్టుకుంటున్నారు.

women in Paderu
కొండ ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చదును చేస్తున్న మహిళలు

By

Published : Dec 19, 2020, 2:05 PM IST

విశాఖ జిల్లా పాడేరు శివారు ముల్లుమెట్ట వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అధికారులు సమాచారం అందించారు. రెవిన్యూ సిబ్బంది వచ్చి కేటాయించిన భూముల వివరాలు తెలిపారు. కొండ ప్రాంతం కావటంతో లబ్ధిదారులు ఆ స్థలాన్ని చదును చేసుకుంటుండగా.. ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.

కొండ ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చదును చేస్తున్న మహిళలు

కొండ ప్రాంతాన్ని చదును చేసి అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు, వ్యవసాయ పనులు వదులుకుని ఇక్కడే పనిచేయాల్సి వస్తుందని వాపోయారు. ఉపాధి హామీ పథకం కింద డబ్బులు చెల్లిస్తామని చెప్పి..అవి కూడా ఇవ్వలేదన్నారు. కూలికి వెళ్లనిదే రోజు గడవటం కష్టమని, ఈ వివాదాస్పద స్థలాలను ఇస్తారో..లేదో కూడా తెలియదని పేర్కొన్నారు.

"ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇలా చెట్లు, రాళ్లు, మొక్కలు తొలగించే పని చేశాం. మొదటి సారి పని చేసినప్పుడు ఉపాధి హామీ పథకం కింద వేతనం చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలకు లేఅవుట్లు వేసి ఇస్తున్నారు. ఇక్కడ కనీసం రహదారి సౌకర్యం కూడా లేని కొండల్లో ఇళ్ల స్థలం కేటాయించారు. పక్కాఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం " -గృహ లబ్ధిదారు

"వైఎస్సార్​ పథకం కింద కేటాయించిన స్థలాలను లబ్ధిదారులే చదును చేసుకోవటం వంటి విషయాలు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. మన ప్రాంతంలో లేఅవుట్ల కన్నా..వ్యక్తిగత స్థలాలే ఎక్కువ. ప్రజల సహకారంతోనే ఏదైనా విజయవంతమవుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే తహసీల్దార్​ వారి సహాయం తీసుకుని ఉంటారు. ఇది వరకు కేటాయించిన స్థలాలకు లేఅవుట్ వేసి, రహదారులు నిర్మించి ఇచ్చాం. ఏది ఏమైనప్పటికీ మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం" -శ్రీలక్ష్మి, ఆర్డీవో, పాడేరు

గిరిజనులకు కేటాయించిన వివాదస్పద కొండ ప్రాంతాన్ని భాజపా నాయకుల బృందం పరిశీలించింది. సాగుదారులకు కాకుండా వేరే స్థానికులకు స్థలం కేటాయించి.. గ్రామాస్థుల మధ్య అధికారులు చిచ్చు పెడుతున్నారన్నారు. ఇరవై ఏడు మంది లబ్ధిదారుల్లో ఇద్దరికి మాత్రమే స్థలం మంజూరు చేశారని చెప్పారు. ముల్లుమెట్టలో 50 గిరిజన కుటుంబాల్లో ఎవరికీ సరైన గృహ వసతి లేదని.. లబ్ధిదారులకు ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి వారిచేతనే పనిచేయించటం సమంజసం కాదన్నారు.

ఇదీ చదవండి:

పరిష్కారం దిశగా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు వివాదం

ABOUT THE AUTHOR

...view details