సచివాలయాల పోస్టులు భర్తీ నిమిత్తం ముందుగా వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. జీవో నెంబర్ 74 ప్రకారం క్రీడా కోటా అమలు చేస్తున్నారు. దీని కింద ఏదైనా పోస్టులో చేరాలనుకున్న వారు అంతకు ముందు ఆటల్లో పతకాలు సాధించి ఉండాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం ఉద్యోగాల్లో చేరిన తర్వాత సైతం పదేళ్లపాటు పాల్గొనాల్సి ఉంటుంది. దీని ద్వారా మరిన్ని పతకాలు రావడం వల్ల దేశ ప్రతిష్ట పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థులంతా ఉద్యోగాల కోసం విశాఖ నగరానికి పయనమవుతున్నారు. వీరంతా సచివాలయాల పోస్టులకు పరీక్ష రాయనున్నారు. స్వర్ణభారతి స్టేడియంలో టీఎస్ కార్యాలయం అధికారులు వీరి ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్‌కు సంబంధించి ఇప్పటికే సుమారు కొంతమంది వివిధ ఉద్యోగాల కోసం విశాఖ పయనమయ్యారు. సచివాలయాల్లో 78 కార్యదర్శి పోస్టులు ఖాళీలు ఉన్న నేపథ్యంలో క్రీడా కోటా కింద వీటిని పొందేందుకు సుమారు 4,500 మంది డీ.ఎస్.ఎ కార్యాలయానికి వచ్చారని.. ప్రస్తుతం వారి ధ్రువ పత్రాలు పరిశీలిస్తున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు చెబుతున్నారు. అక్కడ ప్రత్యేక కమిటీ వీటిని పరిశీలించి ఆ జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేస్తారని వివరించారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు జిల్లా కలెక్టర్ జారీ చేస్తారని పేర్కొన్నారు.