సీలేరు కాంప్లెక్స్ (sileru complex)లోని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీరు వల్ల కాపర్ డ్యాం పనులకు ఆటంకం కలగకూడదని గత నెల 10వ తేదీన విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. తొలుత ఈనెల ఐదో తేదీ వరకూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని జెన్ కో అధికారులు ఆదేశించారు.
అయితే.. పోలవరం (polavaram) పనుల్లో జాప్యం కావడంతో ఈనెల 15 వరకూ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఈలోగా వర్షాలు ప్రారంభం కావడంతో నీటి నిల్వలు జలాశయాల్లోకి చేరే అవకాశముందని జెన్ కో అధికారులు తెలపడంతో కాపర్ డ్యాం పనులు వేగవంతం చేశారు. సోమవారం ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడంతో సీలేరు కాంప్లెక్సులో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.