శ్రద్ధ హాస్పిటల్ ఎండీ కోసం పోలీసుల గాలింపు
వైద్యం ముసుగులో కిడ్నీ అక్రమ విక్రయాలకు పాల్పడుతుతన్న శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఓ వైపు త్రిసభ్య కమిటీ, మరోవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆసుపత్రి యాజమాన్యం కోసం గాలింపు చేపడుతున్నారు.
విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ అక్రమ అమ్మకాల ఘటనపై జిల్లా యంత్రాగం నియమించిన త్రిసభ్య కమిటీతో పాటు విశాఖ పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన విభాగం ముఖ్య వ్యక్తి జె.కుమార్ వర్మను రెండు రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మహారాణిపేట పోలీస్స్టేషన్లో కుమార్ వర్మను విచారిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి ఎండీ ప్రదీప్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. రెండు బృందాలు బెంగళూరు వెళ్లాయి. త్రిసభ్య కమిటీ శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన సంబంధ కాగితాలను పరిశీలన చేసి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతోంది.