విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే 15 రోజుల పూర్తి లాక్‌డౌన్ విధించగా... రాష్ట్రంలో బుధవారం నుంచి నిత్యం 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత ఒడిశా నుంచి రాష్ట్రానికి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.
ఒడిశా సరిహద్దు కూడలిలో ఉన్న సీలేరు గేట్లకు తాళాలు వేశారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ విశాఖ మన్యంలో ప్రశాంతంగా అమలవుతోంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కర్ఫ్యూ వేళ రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.