TDP protests on North Andhra Issues: రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, దసపల్లా భూములు, పేదల స్థలాల ఆక్రమణ వంటి అంశాలపై తెలుగుదేశం నేటి నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇవాళ విశాఖలోని ఆరు చోట్ల నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు నిరసనల్లో పాల్గొనకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖలోని తెలుగుదేశం నాయకుల కదలికలపై నిఘా ఉంచారు. గురువారం తెల్లవారుజామునే పల్లా శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపైనా పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఆయన ఇంటి వద్ద కాపుకాసిన పోలీసులు ఆయన ఎక్కడి వెళ్తే అక్కడికి వెంటాడారు. పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్లినా అనుసరించారు. పోలీసుల చర్యల్ని రామకృష్ణబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి సహా ఇతర ముఖ్య నేతల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. నిర్బంధాన్ని నిరసిస్తూ పల్లా శ్రీనివాసరావు.. గురువారం రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు.
అటు ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచీ తెలుగుదేశం నేతలు విశాఖ రాకుండా.. ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను పోలీసులు అడ్డుకున్నారు. వజ్రపుకొత్తూరు మండలం రాజాం పంచాయతీలో.. బాదుడేబాదుడు కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వారిని.. కాశీబుగ్గలోని అక్కుపల్లి రోడ్డు వద్ద పోలీసులు ఆపారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రాలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా అంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యం నుంచి విశాఖ వెళ్లకుండా.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను పాడేరులో గృహనిర్బంధం చేశారు.
"ఉత్తరాంధ్రకు సంబంధించి తెలుగుదేశం నేతలను ఎవరినీ విశాఖ వెళ్లకుండా పోలీసులు హౌజ్ అరెస్టు చేస్తున్నారు. రాజకీయాలకు ప్రాధన్యతనిస్తూ తుగ్లక్ ముఖ్యమంత్రి పోలీసులను ఆడిస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మొగ్గు చూపించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్రను దోపిడి చేసుకుంటున్నారు. మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి ఈ రోజు ఆపినా, రేపు ఆపినా, ఎప్పిటికి ఆపినా సరే మీ తాలుక భాగోతం బయట పెట్టి రాష్ట్ర ప్రజల ముందు ఎండగడతాం". -రామ్మోహన్‌నాయుడు, ఎంపీ