9న శ్రీవారి సన్నిధికి ప్రధాని మోదీ
భారతావనిపై కాషాయ జెండాను రెండోసారి రెపరెపలాడించిన మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 9వ తేదీన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ నెల 9న తిరుమలకు రానున్నారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో మోదీ పర్యటన వివరాలను ఆ పార్టీ జాతీయ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. శ్రీవారిని దర్శించుకోవటానికి మోదీ తిరుపతి వస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర స్నేహపూర్వకంగా ముందుకు సాగటం అభినందనీయమని కొనియాడారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం పలు సంస్కరణలు చేయటం హర్షణీయమని కొనియాడారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, కళాశాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుకను ఎత్తివేసే ఆలోచనను పునరాలోచించాలని సూచించారు. ఏపీలో జిల్లా సంఖ్య పెంపు హర్షణీయమని, జిల్లా విభజన ప్రక్రియ త్వరగా వేగవంతం చేయాలని విష్ణు అన్నారు.