ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలోనే పూర్తి విధుల్లోకి అత్యాధునిక ‘ధ్రువ్‌’ యుద్ధనౌక

భారత నౌకాదళంలో మరో శక్తిమంతమైన యుద్ధనౌక చేరడానికి రంగం సిద్ధమైంది. వి.సి.11184 పేరుతో నిర్మాణమై ‘ధ్రువ్‌’ పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న ఈ నిఘా యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

new warship dhruv is going to appear in indian navy
త్వరలోనే పూర్తి విధుల్లోకి అత్యాధునిక ‘ధ్రువ్‌’ యుద్ధనౌక

By

Published : Mar 24, 2021, 7:15 AM IST

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన యుద్ధనౌక చేరడానికి రంగం సిద్ధమైంది. వి.సి.11184 పేరుతో నిర్మాణమై ‘ధ్రువ్‌’ పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న ఈ నిఘా యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో అత్యంత రహస్యంగా ఐదేళ్లపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి వినియోగిస్తున్నారు. నూతన యుద్ధనౌకలకు సాధారణంగా నిర్వహించే ప్రారంభోత్సవ వేడుకలేవీ దీనికి జరగలేదు. కొద్దినెలల్లో అధికారికంగా నౌకాదళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ప్రత్యేకతలు ఎన్నో
ఈ యుద్ధనౌకను డీఆర్డీవో శాస్త్రవేత్తలు, విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సాంకేతిక నిపుణులు, నౌకాదళ ఇంజినీర్లు ఎంతో శ్రమించి రూపొందించారు. ప్రధాని కార్యాలయంలోని జాతీయ భద్రతా సలహాదారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ‘జాతీయ సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన సంస్థ’ (నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ -ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములయ్యారు. సాధారణ క్షిపణులతోపాటు అణు క్షిపణులను కూడా గుర్తించగలదు. వేగంగా దూసుకొచ్చే క్షిపణులను సకాలంలో గుర్తించకపోతే.. పర్యవసానంగా జరిగే విధ్వంసం అపారం. క్షిపణుల గుర్తింపు, స్పందన, చర్య.. అన్నీ క్షణాల్లో జరిగిపోయేలా దీనికి అత్యాధునిక సాంకేతిక హంగులు అద్దారు.
పాకిస్థాన్‌, చైనా తదితర దేశాల భూభాగాల్లో నుంచి క్షిపణులను ప్రయోగించినా వాటి ప్రయాణ మార్గాల్ని ఈ యుద్ధనౌక గుర్తించగలదు. అవి ఏ లక్ష్యం దిశగా వెళ్తున్నాయో ముందుగానే అంచనా వేస్తుంది. మార్గమధ్యంలోనే శత్రుదేశాల క్షిపణులను ధ్వంసం చేయడానికి అవసరమైన కీలక సమాచారాన్ని వంద శాతం కచ్చితత్వంతో ఇందులోని నిపుణులు అందించగలుగుతారు.

విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సదుపాయం
పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించినప్పటికీ ఈ యుద్ధనౌకలో వాడిన సాంకేతికత ప్రపంచంలోని నాలుగు దేశాల్లో మాత్రమే ఉంది. తద్వారా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ చేరినట్లైంది. ఈ తరహా అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న ఐదో దేశంగా భారత్‌ గుర్తింపు పొందినట్లైంది. ఈ నౌక బరువు 15వేల టన్నులు 14 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సదుపాయం కూడా ఇందులోనే ఉంది. దేశంలోని షిప్‌యార్డ్‌లన్నింటిలో ఇప్పటివరకు తయారైన యుద్ధనౌకలతో పోల్చితే ‘ధ్రువ్‌’ అతిపెద్దది. 2015లో ప్రారంభించి 2020 అక్టోబరు నాటికి దీని నిర్మాణం పూర్తిచేశారు. రియర్‌ అడ్మిరల్‌ ఎల్‌.వి.శరత్‌బాబు షిప్‌యార్డ్‌ సీఎండీగా ఉన్న కాలంలో అధిక భాగం పూర్తైంది. నిర్మాణానికి రూ.750 కోట్ల వరకు వ్యయమైనట్లు అంచనా.

ABOUT THE AUTHOR

...view details