విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పై ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో నిర్వహించిన కార్మికుల బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణమన్నారు. ప్రైవేటీకరణను వైకాపా చాలా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కార్మిక హక్కులు కాపాడేందుకు ఉద్యమం చేద్దామని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. భూములను తాము దోచుకోవాలని చూస్తున్నామని కొంతమంది అంటున్నారన్న విజయసాయిరెడ్డి.. తమది పేదల పార్టీ, ధనికుల పార్టీ కాదని అన్నారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం' - విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు మొదట్నుంచీ చెబుతున్నామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఎంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును.. ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకూడదని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం.. రాజకీయాలకు అతీతంగా పోరాడుదామంటూ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
వామపక్షాలతో కలిసి ఉక్కు ఉద్యమంలో పోరాడతామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎలాంటి అపోహలు అవసరం లేదని భరోసా ఇస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించలేదన్న ఎంపీ.. ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్రలో భాగంగా చేశారని అన్నారు. సీఎం అనుమతి తీసుకుని కార్మిక సంఘాల నిరాహార దీక్షలో పాల్గొంటామని తెలిపారు. కార్మిక సంఘాల నాయకులను దిల్లీ తీసుకెళ్లి కేంద్ర పెద్దలను కలిపిస్తామని అన్నారు.
ఇదీ చదవండి:తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉంది: నిమ్మగడ్డ