ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం! - vishak news

పెళ్లి వయసు వచ్చిందో లేదో.. ఆమెకు వివాహం చేసేశారు. పెళ్లికి ముందు తండ్రి... ఆ తర్వాత 9 నెలలకు భర్త... ఇద్దరూ చనిపోయారు. అప్పటికే కడుపులో పెరుగుతున్న బిడ్డయినా తోడుంటుంది అనుకుందా తల్లి. జన్మనిచ్చాకే తెలిసింది ఆ బిడ్డకు మానసిక ఎదుగుదల లేదని.! ఏడిస్తే ఆదుకునే దిక్కూ లేదు. ఏడేళ్లు నిండిన గారాలపట్టి నవ్వుల‌ను ఆస్వాదించాలో... చికిత్సకు తన ఆర్థిక స్తోమత సరిపోదని గుర్తొచ్చి ఏడవాలో తెలియని దుస్థితి ఆమెది. చిన్న వయసులోనే.. ఏ తల్లీ పడని పాట్లు పడుతున్న ఓ అమ్మ దీనగాథ ఇది.

mother affliction for his daughter

By

Published : Oct 6, 2019, 1:47 PM IST

ఆ తల్లి ఇంట్లో బిడ్డను వదిలి తాళం వేసి వెళ్తోంది.. ఏంటీ దైన్యం అనుకుంటున్నారా.? ఆడబిడ్డనే ఈసడింపుతో చేస్తున్న పని కాదిది.! పూట గడవాలన్నా.. తన చిట్టితల్లికి మందులు కొనాలన్నా... అలా చేయక తప్పని పరిస్థితి. మానసిక వికలాంగురాలైన తన కుమార్తె ముఖంలో నవ్వులు చూడాలంటే పని చేయక తప్పదు. ఎందుకంటే ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. పనిచేసుకుంటే తప్ప పూటగడవదు. కన్న కూతురిని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తుంటే మాత్రం రోజూ నరకం చూస్తోందా తల్లి.

కుమార్తె పుట్టింది కానీ..!

విశాఖకు చెందిన అలివేలుకు పెళ్లంటే ఏ మాత్రం అవగాహన లేని వయసులోనే పెళ్లయ్యింది. తాగుడికి బానిసైన భర్త 9 నెలలకే కాలం చేశాడు. జీవితం అంధకారంగా మారిన సమయంలో కడుపులో పెరుగుతున్న బిడ్డ కొత్త ఆశలు రేకెత్తించింది. తీరా ఆ ఆనందాన్ని ఆమెకు దూరం చేశాడు దేవుడు...కుమార్తె యమున మానసిక వికలాంగురాలని తెలిసి ఆ తల్లి గుండె చెరువ్వయ్యింది.

బిడ్డను ఇంట్లో తాళం వేసే..!

అత్తారింటి నుంచి ఎలాంటి ఆసరా లేకపోవడంతో...మానసిక వికలాంగురాలైన కుమార్తెతో అలివేలు ఒంటరిగానే జీవిస్తోంది. వితంతు పింఛన్‌తో నెట్టుకొస్తున్న ఆమె....చిన్నారి వైద్యఖర్చులకు, మందులకు డబ్బులు సరిపోక... ఓ వృద్ధ దంపతులకు సహాయకురాలిగా ఉంటోంది. ఆ ఇంట్లో పనికి వెళ్లేందుకే చిన్నారి యమునను ఇంట్లో ఉంచి తాళం వేస్తోంది.

ప్రభుత్వం ఆదుకోవాలి

చిన్నారి యమునకు వికలాంగుల ఫించన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అలివేలు వాపోతోంది. స్పందన కార్యక్రమంలోనూ దరఖాస్తు చేసుకున్నా.. ఎదురు చూపులు తప్పట్లేదంటోంది. ప్రభుత్వం ఆదుకుని వీలైనంత త్వరగా పింఛన్ మంజూరు చేయాలని అలివేలు వేడుకుంటోంది.

తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!

ఇదీ చదవండి:బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి..ఓ తల్లి ఆవేదన

ABOUT THE AUTHOR

...view details