ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరకుల పంపిణీ నవంబరుతో ముగిసింది. డిసెంబర్ నుంచి యథావిధిగా డబ్బులు చెల్లించి రేషన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే గతంలో కంటే వాటి ధరలు ప్రస్తుతం పెరగనున్నాయి. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, పంచదార రేట్లు భారీగా పెరిగాయి. 4 నెలల క్రితమే వీటి ధరలు పెంచినా.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేశారు. డిసెంబర్ నుంచి పెరిగిన ధరలతో ప్రజలు రేషన్ తీసుకోవాలి.
విశాఖ జిల్లాలో పెరిగిన రేషన్ ధరలతో ప్రజలపై రూ. 4.37 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 13,03,528 మంది లబ్ధిదారులు ఉన్నారు. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. కిలో కందిపప్పుకు రూ. 67, పంచదారకు రూ. 17లు చెల్లించాలి. అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. పెరిగిన ధరలతో ఒక్కో కార్డుపై సగటున రూ. 34 అదనపు భారం పడనుంది. ఏవై కార్డుదారులకు ఎప్పటిలాగే అరకిలో పంచదార రూ. 13.50కు ఇవ్వనున్నారు.