విశాఖలో ఎల్జీ పాలిమర్స్ మూతపడి ఉంది.. ఇక మూతపడే ఉంటుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికలు వచ్చే వరకు పరిశ్రమను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంత విషాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్‌ను తరలించేందుకు రెండు కంటైనర్లు సిద్ధం చేశామన్నారు. ఒక కంటైనర్ షిప్లో 8వేల 500 టన్నుల స్టైరీన్ నింపే ప్రక్రియ మెుదలయ్యినట్లు వివరించారు. మెుత్తం గ్యాస్‌ను తరలించేందుకు 5 రోజుల సమయం పడుతుందని నిపుణులు తెలియజేశారన్నారు.
'కమిటీ నివేదిక వచ్చే వరకూ పరిశ్రమ తెరిచేది లేదు' - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ మూతపడే ఉంటుందని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. పరిశ్రమ మెుత్తాన్ని దక్షిణ కొరియాకు తరలించేందుకు కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
వదంతులు నమ్మవద్దన్న మంత్రి కురసాల
పరిశ్రమను దక్షిణ కొరియాకు తరలించేందుకు కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అందరూ సమన్వయంతో పని చేయాల్సిన సమయమనీ, పరిశ్రమను మరలా తెరుస్తారనే పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి మనసున్న సీఎం కాబట్టే అడగకుండానే సాయం చేశారన్నారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'విశాఖ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల్లో రాత్రి బస'