తెలుగు భాషా దినోత్సవాన్ని కాబోయే పరిపాలనా రాజధాని విశాఖలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత - సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి అన్నారు. మన దేశ జనాభా కంటే అధిక జనాభా కలిగిన చైనాలో మాతృభాషకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని, అక్కడి వారు సెల్‌ఫోన్ వినియోగం, డిజిటల్ గ్రంథాలయాలను మాతృభాష మాధ్యమంలోనే కొనసాగిస్తున్నారని మంత్రి వివరించారు. మాతృభాష తల్లిలాంటిదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందని చెప్పారు.